ఐడీసీ ఎత్తివేత!

15 Dec, 2019 02:58 IST|Sakshi

ఈఎన్‌సీల సంఖ్య పెంపు

వారి పరిధిలోకి నలుగురైదుగురు సీఈలు

సాగునీటి శాఖ పరిధిలో ఉన్న విధానాల పునర్‌వ్యవస్థీకరణ

ప్రాజెక్టుల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు కొత్త పాలసీ

సీఎం సూచనల మేరకు 21, 22 తేదీల్లో వర్క్‌షాప్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్‌ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో పలు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాగునీటి శాఖను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించేందుకు సిద్ధమయ్యారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అనేది లేకుండా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేవాలని, ఇప్పటివరకు ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న రాష్ట్ర సాగునీటి అభివృధ్ధి సంస్థ (ఐడీసీ)ని పూర్తిగా ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు.

భవిష్యత్తుకు దిక్సూచిగా ప్రక్షాళన.. 
ప్రస్తుతం సాగునీటి శాఖలో ఐదుగురు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)లు ఉన్నారు. వారికి అదనంగా మరో ఇద్దరు, ముగ్గురు ఈఎన్‌సీలను పెంచి వారి పరిధిలోకి నాలుగేసి జిల్లాల సర్కిళ్లను తేనున్నారు. ఒక్కో సర్కిల్‌కు చీఫ్‌ ఇంజనీర్‌ను నియమించి వారి కిందే జిల్లాకు సంబంధించిన భారీ, మధ్యతరహా, చిన్ననీటి, ఐడీసీ పథకాల పనులన్నింటినీ తేవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం పాలమూరు జిల్లాను తీసుకుంటే జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులకు ఒక సీఈ, మైనర్‌ వ్యవహారాలు చూసేందుకు మరో సీఈ, ఐడీసీ పథకాలకు మరో సీఈ ఉన్నారు.

అయితే అలా కాకుండా జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాల పనులు ఒక్క సీఈ కిందకే తేవాలన్నది సీఎం ఉద్దేశంగా ఉంది. దీని ద్వారా జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒక్కరి వద్దే నిక్షిప్తంగా ఉంటుందని, నిర్ణయాలు సైతం ఒక్కరే తీసుకుంటారని, నిధుల ఖర్చు సులువుగా ఉంటుందని ఇటీవల సమీక్ష సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ఐడీసీని పూర్తిగా ఎత్తివేయాలని సూచించారు.

10 వేల ఎకరాల వరకు సాగునీటిని అందించేలా ఐడీసీ ద్వారా ఎత్తిపోతల పథకాలు చేపడుతుండగా ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రాజెక్టులు చేపడుతున్నందున ఐడీసీ ప్రత్యేకంగా అక్కర్లేదన్నది సీఎం అభిప్రాయమని ఇంజనీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సూచనల మేరకు పలు విభాగాలను సమీకృతం చేసేలా సాగునీటి శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఇంజనీర్లకు మార్గదర్శనం కోసం ఈ నెల 21, 22 తేదీల్లో వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. ఈ మేరకు అందరికీ సమాచారం పంపింది. ఇందులో ఏదో ఒకరోజు వర్క్‌షాప్‌నకు సీఎం హాజరయ్యే అవకాశం ఉంది.

ఓ అండ్‌ ఎంకుపాలసీ..
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం)కు ప్రత్యేక పాలసీని రూపొందించాలని సీఎం నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూడాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్‌ ఉండాలని సూచించారు. ఆయన సూచనల మేరకు ఎత్తిపోతల పథకాల పరిధిలో పంప్‌హౌస్‌లలోని పంపులు, మోటార్లు, విద్యుత్‌ లైన్లు, సబ్‌ స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, రిజర్వాయర్, బ్యారేజీల గేట్లు, కాల్వలు, టన్నెళ్లు నిర్వహణ ఓ అండ్‌ ఎం కిందకే తేనున్నారు. వాటి నిర్వహణ ఖర్చును ఆయా జిల్లా బాధ్యతలు చూసే ఈఎన్‌సీ, సీఈలు పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓ అండ్‌ ఎంకు అవసరమయ్యే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇతర సిబ్బంది అవసరాలపై ప్రాజెక్టులవారీగా లెక్కలు తీసి నిర్ణీత సిబ్బంది నియామకాలు చేపట్టే బాధ్యతలను కట్టబెట్టనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా