మళ్లీ మళ్లీ పొడిగింపు..!

1 Jul, 2018 03:15 IST|Sakshi

కేంద్ర సాయం పొందుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల సాగదీత

సీడబ్ల్యూసీని మరో ఏడాది గడువు అడిగిన నీటి పారుదల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. ఏఐబీపీ పరిధిలో ఉన్న 11 రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను గత ఏడాది జూన్‌ నాటికే పూర్తి చేయాలని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. చాలా ప్రాజెక్టుల కింద భూసేకరణ, నిధుల విడుదలలో జాప్యం వల్ల ప్రాజెక్టులను ఈ సీజన్‌లో పూర్తి చేయలేమని వచ్చే జూన్‌ వరకు గడువు పొడగించాలని నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి స్పష్టం చేసింది. పొడిగింపు జాబితాలో భారీ ఆయకట్టు లక్ష్యాలున్న దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ఎస్సారెస్పీ–2, భీమా వంటి ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. 

మూడు పూర్తి.. ఎనిమిది అసంపూర్తి.. 
ఏఐబీపీ కింద రాష్ట్రంలోని కొమురం భీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగ న్నాధ్‌పూర్, భీమా వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.24,719 కోట్లు అవసరం ఉండగా ఇప్పటికే 18,838 కోట్లు ఖర్చు చేశా రు. మరో రూ.5,881 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మొత్తం అవసరాల్లో కేంద్రం తన సాయం కింద రూ.4,513 కోట్లు అందించాల్సి ఉండగా ఇంతవరకు రూ.3,949 కోట్లు అం దించింది. మరో రూ.564 కోట్ల మేర అందించాలి. ఈ ప్రాజెక్టులను 2014 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు వాటి గడువును 4 సార్లు పొడిగించారు. 2017 మార్చిలో దీనిపై ప్రధాని మోదీ సమీక్షించినపుడు ఆ ఏడాది జూన్‌ నాటికే దేవాదుల, భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగులు పూర్తి చేస్తామని తెలిపింది. గొల్లవాగు, జగన్నాధ్‌పూర్‌ పెద్దవాగు, పాలెంవాగు, కొమురం భీం, ర్యాలివాగు, నీల్వాయిలను 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామంది.  గొల్లవాగు, ర్యాలివాగు, మత్త డి వాగే పూర్తయ్యాయి. మరో 8 ప్రాజెక్టుల పరిధిలో 15 వేల ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండటంతో ఆలస్యమయ్యాయి.

భూ సేకరణలో జాప్యం: దేవాదుల ప్రాజెక్టుకు మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇంతవరకు 11వేల హెక్టార్లు సేకరించగా, మిగతా 3,900 హెక్టార్లను సేకరించాలి. దీంతో పాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్‌ పనులను, భీమా, కొమురం భీంలో మిగిలిపోయిన భూ సేకరణను వేగిరం చేసి పనులు పూర్తి చేయాల్సి ఉండగా అది పూర్తవలేదు. దీంతో పనులు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో మంగళవా రం దీనిపై కాడా అధికారులతో కేంద్ర జల సంఘం సీఈ రంగారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రాజెక్టు పూర్తికి కొత్త లక్ష్యాలను నిర్ణయించారు. పాలెంవాగును ఈ ఏడాది డిసెంబర్‌కు, దేవాదుల, ఎస్సారెస్పీ–2, భీమా, నీల్వాయి, కుమురం భీం, జగన్నాధ్‌పూర్‌లను వచ్చే ఏడాది జూన్‌ నాటికి, ఇందిరమ్మ వరద కాల్వ పనులను వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ హామీ ఇచ్చిం ది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సత్వ రం విడుదల చేస్తే నిర్ణీత సమయానికి పూర్తి చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పింది. 

మరిన్ని వార్తలు