తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం!

5 Aug, 2014 03:04 IST|Sakshi
తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం!

* ఆ దిశగా బడ్జెట్ ప్రణాళికలు రూపొందిస్తున్న నీటిపారుదల శాఖ
* ఉన్నతాధికారులు, నిపుణులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

 
సాక్షి, హైదరాబాద్:
తక్షణ ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే సాగునీటి ప్రాజెక్టులకే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నవాటిని వెంటనే పూర్తిచేసేలా వాటికి అవసరమైన నిధులకేటాయింపులు ప్రస్తుత బడ్జెట్‌లోనే చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తును నీటిపారుదల శాఖ అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
 
ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ తోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. 12 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టులవారీగా జరుగుతున్న పనులు, అవసరమైన నిధులు, వాటికింద సాగులోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలపై చర్చించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రస్తుత బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి సుమారు రూ.6వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని లెక్క తేల్చినట్టుగా సమాచారం.
 
 మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం..
 తక్షణం పూర్తిచేసే ప్రాజెక్టులపైనే సోమవారంనాటి సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాజెక్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), భీమా(20టీఎంసీలు) ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నందున వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. వీటితోపాటు మొదటినుంచి ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల ప్రారంభానికి కూడా తగిన నిధులు కేటాయించాలని సర్కారు యోచిస్తోందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు