ఆదిలాబాద్‌పై ‘ఐకే’ మార్క్..?

17 Dec, 2014 02:51 IST|Sakshi
ఆదిలాబాద్‌పై ‘ఐకే’ మార్క్..?

నేతల మధ్య సమన్వయం కుదిరేనా..
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: సీనియర్ నేత అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కడంతో ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంద్రకరణ్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్, టీడీపీల్లో కూడా జిల్లావ్యాప్తంగా అనుచర వర్గం ఉండటం పార్టీ బలోపేతానికి కలిసొచ్చే అంశం కాగా, ఇదే తరుణంలో రానున్న రోజుల్లో సొంత పార్టీలో ఆయన ఆధిపత్యం పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో, ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు రానున్న రోజుల్లో రచ్చకెక్కే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం కూడా ఉంది. ఆదిలాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జోగు రామన్న ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు.

అటవీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రామన్నకు వివాదరహితునిగా పేరుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడ విభేదాలకు, వివాదాలకు తావులేకుండా వ్యవహరించారనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీల విమర్శలను గట్టిగా ఎండగట్టడంలో విఫలమయ్యారనే అభిప్రాయం కూడా నెలకొంది. ఎన్నికల ముందు వరకు ఇంద్రకరణ్‌రెడ్డి తటస్థంగా ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన, తన ప్రధాన అనుచరుడు కోనేరు కోనప్పలు బీఎస్పీ నుంచి ఎన్నికల బరిలో నిలిచి.. సొంత చరిష్మతో విజయం సాధించారు. తర్వాత కోనప్పతో కలిసి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇంద్రకరణ్‌రెడ్డి ఆ పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డిని కూడా టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడంలో ఐకేరెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈ ఆరు నెలల్లోనే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలది జిల్లాలో ప్రత్యేక వర్గంగా ముద్రపడింది.

కాంగ్రెస్‌కు చెక్..?
ఇంద్రకరణ్‌రెడ్డికి కాంగ్రెస్‌లో ఇప్పటికీ అనుచరులు ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులతో సంబంధాలున్నాయి. ఒకరిద్దరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు కూడా సన్నిహితులుగా ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో కాంగ్రెస్‌లోని ఆయన అనుచరులు కొందరు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమన్వయం లేకపోతే సమస్యే..
జిల్లాలో రానున్న రోజుల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం ప్రధాన సమస్యగా మారనుంది. ఐకే రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మల్‌లో ఇప్పటికే టీఆర్‌ఎస్ శ్రేణులు నాలుగు వర్గాలుగా విడిపోయాయి. ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్, గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగిన శ్రీహరిరావు వర్గాలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి వేణుగోపాల చారి కూడా నిర్మల్‌లో తన ప్రభావాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతుండటంతో  ఇక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో జిల్లాలో కొనసాగే అవకాశం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు