దేశానికే ఆదర్శం మిషన్ కాకతీయ

29 May, 2016 01:45 IST|Sakshi
దేశానికే ఆదర్శం మిషన్ కాకతీయ

పనులు వేగవంతం చేయాలి    
పనులను పరిశీలించిన మంత్రి జోగు రామన్న

 
ఆదిలాబాద్ రూరల్ : చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం మండలంలోని వాన్‌వాట్, మావల గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తాల రామకిస్టు శివారు ప్రాంతంలో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉన్నందున రెండో విడత ప్రారంభమైన మిషన్ కాకతీయ పనుల్ని నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.

గత ప్రభుత్వాలు చెరువులు, కుంటల నిర్వహణను పూర్తిగా విస్మరించాయన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయాని గుర్తు చేశారు. త్వరలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. మావల శివారు ప్రాంతాంలో హరితహారం కింద పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 400 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

వీరి వెంట జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, ఎంపీపీ అధ్యక్షురాలు నైతం లక్ష్మీ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, మావల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోకా భూమారెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరె రాజన్న, భరత్, ఉపాధ్యక్షుడు నైతం శుక్లాల్ ఉన్నారు.

మరిన్ని వార్తలు