ఇస్లాంకు శత్రువు ఐఎస్‌ఐఎస్

6 Feb, 2015 00:54 IST|Sakshi
ఇస్లాంకు శత్రువు ఐఎస్‌ఐఎస్

హైదరాబాద్: జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదనీ దీనిపేరిట యువత తప్పుదారి పట్టడం సరికాదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ యువతకు హితవుపలికారు. వారికి జీహాద్ చేయాలనే భావనే ఉంటే తమ తమ బస్తీ పరిసరాల్లోని సమస్యలపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేశారు. గురువారం నగరంలోని జామియా నిజామియాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇస్లాంకు ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా) ప్రధాన శత్రువన్నారు. ఐఎస్‌ఐఎస్‌తో ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వాదం ఒక దగా, మోసమని చెప్పారు. ఇస్లాం పేరిట రక్తపాతం సృష్టించడం సహించరానిదన్నారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత  దారితప్పుతోందనీ, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు. జీహాద్‌కు స్పష్టమైన నిర్వచనాన్ని  మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే  తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశంలో మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరంకాదన్నారు.

>
మరిన్ని వార్తలు