అల్లా... శాంతిని ప్రసాదించు

24 Nov, 2015 02:06 IST|Sakshi
అల్లా... శాంతిని ప్రసాదించు

* వేడుకున్న ముస్లింలు
* ముగిసిన ఇస్లామిక్ సమ్మేళనం
 సాక్షి, హైదరాబాద్: ‘అల్లా.. సమాజంలో స్వార్థంతో పాపాలు పెరిగిపోతున్నాయి. రక్తపాతం కొనసాగుతోంది. శాంతిని ప్రసాదించు. సర్వ మానవాళిని కరుణించు. సన్మార్గంలో నడిచేలా దయ చూపు’ అంటూ లక్షలాది మంది ముస్లింలు దేవుడిని వేడుకున్నారు. తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో పహాడీ షరీఫ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ స్థాయి ఇస్లామిక్ (ఇజ్తేమా) సమ్మేళనం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మౌలానా ఖాసీం ఖురేషీ సుదీర్ఘంగా దువా (అల్లాను వేడుకోలు) నిర్వహించారు. సర్వ మానవాళి పాపాలు క్షమించాలని, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అల్లాను వేడుకున్నారు. ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం ఇస్లాం పండితులు మౌలానా అస్లాం, మౌలానా ముస్తాక్, మౌలానా ఖాసీం ఖురేషిలు ప్రసంగించారు. ఇస్లాం మంచిని ప్రబోధిస్తూ శాంతిని కాంక్షిస్తుందన్నారు.

దేవుడి వరం మానవ జన్మ అని, దానిని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహ్మద్ ప్రవక్త అనుసరించిన మార్గంలో జీవన గమనాన్ని సాగించాలన్నారు. మంచి మార్గంలో నడిచినప్పుడే ఇతరులకు ఆదర్శంగా మారుతారన్నారు. ఆధ్యాత్మిక చింతన, సహనం, మంచితనంతో దేనినైనా జయించవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మశుద్ధి అవసరమని, అప్పుడే దేవుడి కృప వెన్నంటి ఉంటుదన్నారు. కాగా, మూడు రోజుల పాటు జరిగిన సమ్మేళనానికి సుమారు నాలుగు లక్షల మందికి పైగా హాజరయ్యారు. ముగింపు సందర్భంగా ఇస్లామిక్ పండితులు భవిష్యత్తు కార్యచరణపై ప్రత్యేక భేటి నిర్వహించారు.

మరిన్ని వార్తలు