జూన్, జూలై నెలల్లో ఇస్టా కాంగ్రెస్‌ 

9 Jan, 2019 01:06 IST|Sakshi

ఏర్పాట్లకు సీఎస్‌ జోషి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 26 నుంచి జూలై 3 వరకు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగే 32వ అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశించారు. ఇస్టా కాంగ్రెస్‌ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ విత్తన ఎగ్జిబిషన్‌పై రూపొందించిన బ్రోచర్‌ను సీఎస్‌ ఆవిష్కరించారు. జూన్‌ 26న ప్రారంభోత్సవ కార్యక్రమం, 26 నుంచి 28 వరకు విత్తన సింపోజియం, అంతర్జాతీయ విత్తన ప్రదర్శ న, 28న విత్తన వ్యవసాయదారుల సమావేశం, జూన్‌ 29 నుంచి జూలై 3 వరకు ఇస్టా వార్షిక సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో  400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. వీరికి వసతి, భద్రత, రవాణా సదుపాయాలు కల్పించాల ని అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 విత్తన కంపెనీలు పాల్గొంటాయన్నారు. కొత్త ఉత్పత్తులు, సీడ్‌ ప్రాసెసింగ్, ప్యాకింగ్‌ ఎక్విప్‌మెంట్స్, సీడ్‌ ట్రీట్‌మెంట్, నూతన టెక్నాలజీపై ప్రదర్శన ఉంటుందని చెప్పారు. విత్తన ఉత్పత్తి, నాణ్యతపై సింపోజియం ఉంటుందన్నారు. ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ సహకారంతో ఈ కాంగ్రెస్‌ జరుగుతుందన్నారు. 

రైతులకు అవగాహన సమావేశాలు.. రైతులకు విత్తన ఉత్పత్తిలో అమలవుతున్న నూతన పద్ధతులు, నాణ్యతపై అవగాహన కల్పించడానికి ఈ సమావేశాలు జరుగుతాయని సీఎస్‌ తెలిపారు. ఇస్టా కాంగ్రెస్‌కు ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ ప్రతినిధులు తెలంగాణలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్యా కేజీ వివరాలను వారికి తెలపాలన్నారు. ఈ సమా వేశంలో ఇస్టా సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ ఆండ్రియాస్‌ వియాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన ఇస్టా ప్రతినిధి ఓల్గా స్టోకీ, ఇక్రిసాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ పీటర్‌ కార్‌ బెర్రీ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, టూరిజం శాఖ కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు