మంథనిలో కరెన్సీ కలకలం..

24 Oct, 2018 08:10 IST|Sakshi
సోదాల అనంతరం తిరిగి వెళ్తున్న ఐటీ అధికారి ఐటీ అధికారులు తనిఖీ చేసిన ఇల్లు

 సాక్షి, మంథని: ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లా మంథనిలో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. మంథని మండలం గుమునూరు–1 అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌ వరహాల సత్యభామ మంథని పట్టణంలోని నడివీధిలో నివాసముంటున్నారు. ఈమె ఇంట్లో పెద్దఎత్తున నగదు నిల్వఉన్నట్లు ఐటీశాఖ అధికారులకు ఫిర్యాదు అందడంతో మంగళవారం కరీంనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రాత్రి 8.30 వరకు సోదాలు జరిగాయి. దాడిలో రూ.22 లక్షల నగదు దొరికినట్లు సమాచారం. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు తెలిసింది. కాగా.. సత్యభామ కుమారుడు సురేందర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం మల్లారం గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు.

ఈయనను సైతం అధికారులు విచారించినట్లు తెలిసింది. ఎనిమిది గంటలకుపైగా ఐటీ అధికారులతో పాటు ఎన్నికల నియమావళి డివిజన్‌ పర్యవేక్షణ కమిటీ దాడులు సమాచారం మంథనిలో దావనంలా వ్యాపించడంతో సత్యభామ ఇంటి వద్ద పెద్దఎత్తున జనం గుమిగూడారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు ఐటీ అధికారులు నిరాకరించారు. తాము సమాచారం చెప్పడానికి లేదని.. తమ ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పారు. దాడిలో పాల్గొన్న వారి పేర్లను సైతం చెప్పేందుకు నిరాకరించారు. అంగన్‌వాడీ టీచర్‌ వద్ద ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎలా నిల్వఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కూడగట్టిన సొమ్ముతో హైదరాబాద్‌లో గృహం కొనుగోలు చేసేందుకు సమాయత్తమవుతుందని.. డబ్బు ఉన్న సమాచారం ఎవరో గిట్టనివారు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు