గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు

10 Aug, 2016 01:42 IST|Sakshi
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు

‘టెలేఖ’ స్టార్టప్ కంపెనీ బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: నగరాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలకొల్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో త్వరలో నెలకొల్పబోయే ‘టెలేఖ నెట్‌వర్కింగ్ టెక్నాలజీ’ స్టార్టప్ సంస్థ బ్రోచర్‌ను మంగళవారం సచివాలయంలో ఈటల ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంస్థలు నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు వారి నైపుణ్యాన్ని వినియోగించుకునే అవకాశం సంస్థలకు లభిస్తుందన్నారు.

సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ‘టెలేఖ’ సీఈవో పొన్నం రోహిత్‌చంద్ర మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే ఉద్దేశంతోనే హుజూరాబాద్‌లో సంస్థను నెలకొల్పుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టెలేఖ  ప్రతినిధులు సచిన్, అనూష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు