కంపెనీ పెట్టండి..రాయితీ పట్టండి

26 Oct, 2019 04:33 IST|Sakshi

ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల పాలసీ’ముసాయిదా సిద్ధం చేసిన ఐటీ శాఖ

2016 నాటి విధానాన్ని ఆమోదిస్తే రాయితీల వరదే

స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుపై వంద శాతం రీయింబర్స్‌మెంట్‌

పెట్టుబడి వ్యయంపైగరిష్టంగా రూ.50లక్షల రాయితీకి ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో ‘ఎలక్ట్రానిక్స్‌ పాలసీ’ని రూపొందించింది.దీని అమలులో అనుసరించాల్సిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎలక్ట్రానిక్స్‌ పాలసీ మార్గదర్శకాల ముసాయిదాను ఇటీవల సిద్ధం చేసిన ఐటీ శాఖ..త్వరలో ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. పాలసీ అమలు తేదీ.. ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

‘ఈ–పాలసీ’కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో ‘ఈ– పరిశ్రమల’స్థాపన వేగం కానుందని ఐటీ శాఖ అంచనా. ఇది అమల్లోకి వస్తే ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద, భారీ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది. స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు, సరసమైన ధరల్లో భూ కేటాయింపు, నాలా నిబంధనల సడలింపు, గరిష్టంగా రూ.50 లక్షలకు మించకుండా పెట్టుబడి రాయితీ వంటి అంశాలు మార్గదర్శకాల్లో పొందుపరిచారు.

కంపెనీ ఏర్పాటుకు భూమి కొంటే... 
ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల ఏర్పాటుకు భూమి కొనుగోలు చేసే సంస్థకు వంద శాతం స్టాంప్‌ డ్యూటీతో పాటు, బదలాయింపు పన్ను,, రిజిస్ట్రేషన్‌ ఫీజును ప్రభుత్వం రీయంబర్స్‌ చేస్తుంది. ఒక వేళ అది రెండో లావాదేవీ అయ్యే పక్షంలో పైన పేర్కొన్న వాటిలో 50శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే షెడ్లు, భవనాలు తదితరాలపైనా స్టాంప్‌ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తారు.పరిశ్రమల స్థాపనకు వీలుగా భూములు అందుబాటు ధరల్లో లభించేలా చూడటంతో పాటు, లీజుకు తీసుకుని ఏర్పాటు చేసే సంస్థలకు పదేళ్ల పాటు 25% లీజ్‌ రెంటల్‌ సబ్సిడీ ఇస్తారు. మహేశ్వరంలోని ‘ఈ– సిటీ’లో ఏర్పాటయ్యే తొలి 30 పరిశ్రమలకు భూమి కొనుగోలుపై 60% సబ్సిడీ లభించనుంది. ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు స్థాపించే ప్రైవేటు సంస్థలకు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.

పెట్టుబడిపై గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ 
సూక్ష్మ, చిన్న తరహా కేటగిరీలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసే తొలి 50 సంస్థలకు 20శాతం పెట్టుబడి రాయితీ లేదా గరిష్టంగా 50లక్షల రాయితీ ఇవ్వాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 35%, మహిళా పారిశ్రామికవేత్తలకు 45% వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. మధ్య, పెద్ద, భారీ తరహా పరిశ్రమల కేటగిరీలో అర్హత కలిగిన తొలి 25 పరిశ్రమలకు 20 % రాయితీ లేదా గరిష్టంగా రూ.2 కోట్ల మేర రాయితీ లభిస్తుంది. భవనం, యంత్రాలపై పెట్టుబడికి గాను ఆయా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది మొదలు ఐదు నుంచి ఏడేళ్ల వరకు కేటగిరీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ ఇస్తారు. సూక్ష్మ పరిశ్రమలు యంత్రాలపై పెట్టే మొత్తంలో 10% సాయాన్ని ప్రభుత్వమే అందజేయనుంది.

నాణ్యత సర్టిఫికెట్ల  వ్యయంపైనా సబ్సిడీ 
ఉత్పత్తులకు గాను చైనా కంపల్సరీ సర్టిఫికెట్, కన్ఫర్మిటీ యూరోపియన్, యూఎల్‌ సర్టిఫికెషన్, ఐఎస్‌ఓ తదితర అంతర్జాతీయ నాణ్యత సర్టిఫికెట్ల కోసం ఈ పరిశ్రమలు పెట్టే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.2లక్షలను ప్రభుత్వమే భరిస్తుంది. క్లీన్‌ ఎనర్జీ వినియోగించే పరిశ్రమలకు గరిష్టంగా రూ.2లక్షలు రాయితీ ఇవ్వడంతో పాటు, వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల పాటు వంద శాతం విద్యుత్‌ సుంకంపై మినహాయింపు ఇస్తారు. తెలంగాణ కేంద్రంగా ఉండే ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలకు పేటెంట్ల సాధన కోసం ఖర్చులో 50% లేదా గరిష్టంగా రూ.2లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విడి భాగాల రవాణాకు అయ్యే వ్యయంపైనా ఐదేళ్ల పాటు గరిష్టంగా 60% నుంచి 20% వరకు సబ్సిడీ కల్పిస్తారు. 50 మందికి ఉపాధి కల్పించే ‘ఈ పరిశ్రమలకు’రూ.5లక్షలను రిక్రూట్‌మెంట్‌ అసిస్టెన్స్‌గా ఐటీ శాఖ అందజేయనుంది

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు