శభాష్‌..అలెక్స్‌

20 Dec, 2018 08:55 IST|Sakshi

రోడ్డు ప్రమాద బాధితులకు ఐటీ ఉద్యోగి సహాయం

పోలీసుల కోసం వేచి చూడకుండా అంబులెన్స్‌లో తరలింపు

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి అలెక్స్‌కు ఉన్నతాధికారుల ప్రశంస

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు..హైఫై లైఫ్‌స్టైల్‌...అయితేనేం సమాజంలో ఎదురవుతున్న సమస్యలను తమవిగా భావిస్తున్నారు... ఆఫీసుకు వెళ్లే క్రమంలో వేలాది మందికి నరకం చూపిస్తున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు వందలాది మంది ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రాఫిక్‌ వలంటీర్లుగా పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌కు అదనపు బలంగా ఉంటూ కీలక సమయాల్లో స్వచ్ఛంద సేవలు అందిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. తాము వెళ్లే దారిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారి ప్రాణాలను రక్షించడంలోనూ ముందుంటున్నారు.

సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఇప్పటికే ట్రాఫిక్‌ వలంటీర్‌గా సేవలందిస్తున్న మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి చెందిన ఉద్యోగి అనుమోద్‌ అలెక్స్‌ థామస్‌ ఈ నెల 17న ఉదయం ఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ వలంటీర్‌గా సేవలందించి ఆఫీసుకు బయలుదేరుతుండగా అదే సమయంలోనే జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించి బాధితురాలిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించాడు.   థామస్‌ ఒక్కడే కాదు ఎస్‌సీఎస్‌సీ ఆధ్వర్యం లో వలంటీర్లుగా పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు సకాలంలో స్పందించి ప్రాణాలను నిలబెడుతున్నారు. అయితే చాలా మంది రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో పట్టించుకుంటే పోలీ సువిచారణ, కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని భావిస్తున్నారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ పేరుతో ఆపదలో ఆదుకున్న వారిపై ఒత్తిడి తేమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కళ్లముందు రోడ్డు ప్రమాదం జరిగితే సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.  

స్ఫూర్తిగా తీసుకోండి..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను సకాలంలో ఆస్పత్రికి చేర్చిన అనుమోద్‌ అలెక్స్‌ థామస్‌ చొరవ అభినందనీయమని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. బుధవారం ఆయన అలెక్స్‌ను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు పిలిపించి ప్రశంసాపత్రం అందజేశారు. అలెక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతామన్నారు. ఇప్పటికే వందలాది మంది ఐటీ ఉద్యోగులు సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌లో తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.

సంతోషంగా ఉంది...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించగలిగానని అలెక్స్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తనతో పాటు స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు చూపిన చొరవతోనే ఇది సాధ్యమైందన్నాడు. ఇప్పటికే ట్రాఫిక్‌ వలంటీర్‌గా సేవలందిస్తున్న తాను ఒక మహిళ ప్రాణాలు నిలపగలగడం అమితానందన్ని ఇస్తున్నట్లు తెలిపాడు.  తోటివారికి సేవ చేయడంలో అసలైన సంతృప్తి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.   

మరిన్ని వార్తలు