ఖరీఫ్ ఖతం

31 Jul, 2015 00:08 IST|Sakshi
ఖరీఫ్ ఖతం

రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)   ఆయకట్టు కింద ఈ ఖరీఫ్‌లో పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు తుంగభద్రకు సరైన వరద నీరు రాలేదు. ఈ ప్రాజెక్టు నిండితేనే ఆర్డీఎస్ ద్వారా నీటి విడుదల సాధ్యమవుతుంది. కానీ, ఇన్‌ఫ్లో తక్కువగా ఉండడంతో ఖరీఫ్ పంటపై అన్నదాతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
- ఆర్డీఎస్ నుంచి నీటి విడుదల కష్టమే
- తుంగభద్రలో 36టీఎంసీల నీటి నిల్వ చేరితేనే కిందకు విడుదల
- ప్రస్తుతం వస్తున్న వరద 8,708 క్యూసెక్కులే
- కర్ణాటకలో సరైన వర్షాలు లేకపోవడమే కారణం
- అయోమయంలో అన్నదాత
జూరాల :
తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గింది. కేవలం 8,708 క్యూసెక్కులు వస్తుంది. దీంతో ఆర్డీఎస్ పరిధిలో ఖరీఫ్ సాగుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వ మరో 37 టీఎంసీలు చేరితే తప్ప నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆ నీరు ఎప్పుడు వస్తుందో... ఆర్డీఎస్ ఆయకట్టులో ఖరీఫ్‌కు సాగునీరు ఎప్పుడు అందుతుందో తేలని ప్రశ్నగా మారింది. ప్రతి ఏటా ఆగస్టు మొదటి, రెండవ వారాల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు ఖరీఫ్ నీటి విడుదల ప్రారంభమయ్యే ది. గతేడాది ఇదే రోజున తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటి నిల్వ 85 టీఎంసీలు ఉంది. ఇప్పుడు కేవలం 63 టీఎంసీలకే పరిమితమైంది.

కర్ణాటకలో వర్షాలు తగ్గిపోవడం, ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరీ తక్కువగా ఉండడంతో తుంగభద్ర ప్రాజెక్టులో నీటినిల్వ పూర్తిస్థాయికి చేరేందుకు ఎన్నాళ్లు పడుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులే మరో నెలరోజులు ఇలాగే కొనసాగితే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నదిలోకి నీటి విడుదల ప్రారంభం కాక.. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందడం కష్టమవుతుంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వకు చేరి క్రస్టుగేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తేనే ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌కు నదిద్వారా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు గేట్ల నుంచి నీటి విడుదల ప్రారంభమయ్యే వరకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం లేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 87,500 ఎకరాల ఆయకట్టు మన రాష్ట్ర పరిధిలో, కర్ణాటకలో అధికారికంగా 5వేల ఎకరాలు, అనధికారికంగా మరో 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

ఆర్డీఎస్ ప్రాజెక్టు 1,2 ప్యాకేజీలలో ఆధునికీకరణ పనులు పూర్తికానందున పూర్తిస్థాయి ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందించలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ ఖరీఫ్‌లో ఆర్డీఎస్ ద్వారా 25వేల నుంచి 30వేల ఎకరాల వరకు సాగునీరందించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వ నుంచి హెచ్‌ఎల్‌బీసీ, ఎల్‌ఎల్‌బీసీలకు ఖరీఫ్ ఆయకట్టులో నారుమడులు చేసుకునేందుకు ఇప్పటికే నీటి విడుదలను ప్రారంభించారు. రోజూ దాదాపు 7వేల క్యూసెక్కుల విడుదల కొనసాగుతుండగా రిజర్వాయర్‌కు పై నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకు తగ్గిపోతుంది. ఇన్‌ఫ్లో తగ్గిపోయినా ఆయకట్టుకు నీటి విడుదల చేసినందున పంటలు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఔట్‌ఫ్లోను ప్రధాన కాలువల ద్వారా చేయాల్సి ఉంటుంది.

దీంతో రిజర్వాయర్‌లో ఉన్న నీటిమట్టం రోజురోజుకు మరింతగా తగ్గిపోతుంది. వర్షాలు ఇలాగే ఆలస్యమైతే రిజర్వాయర్‌లో మరింతగా నీటిమట్టం పడిపోయి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఖరీఫ్‌లో కన్నీళ్లు తప్పేలా కని పించడం లేదు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 (1633 అడుగులు) టీఎంసీలు కాగా, ప్రస్తు తం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి నిల్వ మట్టం 63.7 (1621.98 అడుగులు) టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే రో జున 85 టీఎంసీల నీటినిల్వ ఉంది.

మరిన్ని వార్తలు