‘వి–హబ్‌’తో మహిళా సాధికారత..

21 Dec, 2019 03:59 IST|Sakshi
కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, జయేశ్‌రంజన్‌లకు వివరాలు వెల్లడిస్తున్న వింగ్‌ ప్రతినిధి. చిత్రంలో వింగ్‌ సీఈవో దీప్తి రావుల

‘వింగ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం 

రూ. 15 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ 

రూ. 25 లక్షల నుంచి కోటి వరకు గ్రాంటు.. 

సాక్షి, హైదరాబాద్‌ : సామాజిక కట్టుబాట్లు, ఆర్థిక స్వాతంత్య్రం, విద్య అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ఇన్నాళ్లూ మహిళల్లో దాగిఉన్న ప్రతిభ వెలుగుచూడలేదని, మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘వి–హబ్‌’ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొందరు మహిళా వ్యాపారవేత్తలు మాత్రమే ఉన్నారని, మహిళల్లోని ప్రతిభను ఇటీవల ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు వెలుగులోకి తెస్తున్నాయని కితాబిచ్చారు. ‘వి–హబ్‌’, స్టార్టప్‌ ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో చేపడుతున్న ‘వింగ్‌’ కార్యక్రమాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు.

కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సాయం అందుతుందన్నారు. దేశంలో 14 శాతం మాత్రమే మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారని, 95 శాతం స్టార్టప్‌లను పురుషులే నెలకొల్పుతున్నారని చెప్పారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, గణాంకాల పరంగా చూస్తే సాధించాల్సింది ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.15 కోట్ల కార్పస్‌ ఫండ్‌తో పాటు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు గ్రాంటు రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. 

వి–హబ్‌ పనితీరు స్ఫూర్తిదాయకం 
రాష్ట్రంలో స్టార్టప్‌ వాతావరణం పుంజుకోవడంలో వి–హబ్‌ కీలకపాత్ర పోషిస్తోందని, జీఐజీ ఆస్ట్రేలియన్‌ హైకమిషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబుల్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కార్పొరేట్‌ సంస్థలతో వి–హబ్‌ భాగస్వామ్యం హర్షణీయమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌ తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేందుకు అవసరమైన సాధన సంపత్తి సమకూర్చి ఉత్పత్తి దశకు తెచ్చేందుకు అవసరమైన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు.

టీఎస్‌ఐపాస్‌లో మహిళలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న తరహాలో వి–హబ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌కు భూమి, పెట్టుబడి తదితరాలకు సంబంధించి సాయం అందిస్తామన్నారు. స్టార్టప్‌ ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభమైన ‘వింగ్‌’ కార్యక్రమం మరింత మంది మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌ను వెలుగులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి స్టార్టప్‌ ఉత్పత్తులకు తాము మొదటి వినియోగదారుడిగా ఉంటూ, విజయవంతమైతే మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. వి–హబ్‌ పురోగతిని సంస్థ సీఈవో దీప్తి రావుల వివరించగా, జాతీయ స్థాయిలో స్టార్టప్‌ అవార్డులను అందజేశారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, స్టార్టప్‌ ఇండియా హబ్‌ సీనియర్‌ మేనేజర్‌ జస్లీన్‌ లాంబా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు