నలుదిశలా ఐటీ

11 Jul, 2018 03:05 IST|Sakshi
ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ చుట్టూ కొత్త క్లస్టర్లు: మంత్రి కేటీఆర్‌

ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లికి విస్తరణ

ఐటీ ఎగుమతుల విలువ త్వరలో రూ. లక్ష కోట్లకు...

వచ్చే ఐదేళ్లలో లక్షల్లో ఐటీ ఉద్యోగాలు

ఐటీ విస్తరణపై ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌లో నలుదిశలా ఐటీ పరిశ్రమను విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భాగ్యనగరంలో ఐటీ పరిశ్రమల విస్తరణపై మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్‌ నగరం జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఐటీ ఎగుమతుల విలువ త్వరలో రూ. లక్ష కోట్లకు చేరుకోనుందన్నారు. వృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ చెప్పారు.

పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, ఆర్‌ అండ్‌ బీ, జీహెచ్‌ఎంసీ, మెట్రో రైలు, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఐటీ పరిశ్రమలను కలిగి ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ తదితర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి అదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజేంద్రనగర్, బుద్వేల్‌ ఐటీ క్లస్టర్లలో ఇప్పటి నుంచే అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే క్లస్టర్లతోపాటు విస్తరించనున్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 

ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి... 
రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై నగరంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటుతో రానున్న ఐదేళ్లలో లక్షల సంఖ్యలో కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ పెరుగుదల అంతా ఒక వైపే కేంద్రీకృతం కాకుండా నగరంలోని నలుమూలలకూ విస్తరిస్తే భవిష్యత్తులో ట్రాఫిక్‌ వంటి ఇబ్బందులు తలెత్తవని, సమ్మిళిత అభివృద్ధికి అవకాశం కలుగుతుందన్నారు. కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణలో భాగంగా అవసరమైన పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలతోపాటు సాధ్యమైన ప్రాంతాల్లో మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ స్టేషన్ల సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజేంద్రనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భూసేకరణ వంటి విషయాల్లో రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగం క్రియాశీలకంగా పని చేయాలన్నారు.  

మరిన్ని వార్తలు