'డిజిటల్ తెలంగాణ' కు శ్రీకారం

30 Jun, 2015 10:07 IST|Sakshi
'డిజిటల్ తెలంగాణ' కు శ్రీకారం
  • పౌరులకు డిజిటల్ సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
  • రాష్ట్రవ్యాప్తంగా 4జీ, ముఖ్య పట్టణాల్లో వైఫై తదితర సేవల కల్పనే లక్ష్యం
  • జూలై 1 నుంచి వారోత్సవాలు  ఐటీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు
  •  సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో డిజిటల్ తెలంగాణ పేరిట అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జూలై 1 నుంచి డిజిటల్ తెలంగాణ వారోత్సవాలు నిర్వహించాలని ఐటీశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ డి జిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, రాష్ట్రం మొత్తం 4జీ సేవలను అందించడం, పెద్ద నగరాలు, ముఖ్య పట్టణాల్లో వైఫై సదుపాయాల కల్పన, ఈ పంచాయత్ పథకం ద్వారా ప్రతి పంచాయతీలోనూ వన్‌స్టాప్ షాప్‌ను ఏర్పాటు చే యడం వంటి వాటిని ఈ కార్యక్రమం లక్ష్యాలుగా నిర్దేశించుకుంది.
     డిజిటల్ అక్షరాస్యత
     డిజిటల్ తెలంగాణ లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యత, పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, మొబైల్ గవర్నెన్స్ ద్వారా మీ-సేవలను మరింత విస్తృతపరచడం, టెక్నాలజీ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల  నుంచి పౌరులకు మెరుగైన సేవలందించడం సులభం కానుంది. డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా దేవాదాయశాఖ పరిధిలోని యాదాద్రి, భద్రాచలంలో ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల ఏర్పాటు, వ్యవసాయశాఖలో గ్రీన్ ఫ్యాబ్‌లెట్ సదుపాయాన్ని కల్పించనున్నారు. డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయడం, సైబర్ సెక్యూరిటీ, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, 2కె, 5కె రన్‌లు, ప్రతిజ్ఞలు, హ్యాక్‌థాన్‌లు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ సంస్థల్లో హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి వైఫై సదుపాయం కల్పించనున్నారు.
     డిజిటల్ వారోత్సవాలు ఇలా...
     వారోత్సవాల్లో భాగంగా జూలై 1న ప్రధాని మోదీ రేడియో ప్రసంగం మన్‌కీబాత్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రసారం చేస్తారు. 2న గ్రామస్థాయిలో ఆధార్, జీవన్ ప్రమాణ్, డిజిటల్ లాకర్ అంశాలపై అవగాహన కల్పిస్తారు. 3న డివిజన్ స్థాయిలో ప్రభుత్వ విభాగాల అధికారులు, మీసేవ సిబ్బందికి నూతన సర్వీసులపై శిక్షణ అందిస్తారు. 4న జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5న రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌లో 5కె రన్, డిజిటల్ రాహ్‌గిరి కార్యక్రమాలతో డిజిటల్ తెలంగాణపై అవగాహన కల్పిస్తారు. 6న ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో స్వచ్ఛ తెలంగాణ, ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, అవార్డుల ప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు