ఖమ్మంలో కలకలం

19 Sep, 2018 07:06 IST|Sakshi
ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలోకి వెళ్తున్న అధికారులు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాస గృహాలు, వ్యాపార సంస్థల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన సంస్థ ద్వారా సబ్‌ కాంట్రాక్టు పనులు చేపట్టిన వారి ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఉదయం 9 గంటల వరకు ఆయా ప్రాంతాలకు చేరుకున్న అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. తొలుత ఖమ్మంలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్న అధికారులు తాము ఐటీ అధికారులమని పరిచయం చేసుకుని.. తనిఖీల విషయాన్ని వివరించారు. తాము చేసే సోదాలకు సంబంధించి కొందరు వ్యక్తిగత సిబ్బందిని తప్ప ఎవరినీ అనుమతించలేదు. రాఘవ సంస్థకు చెందిన ముఖ్యులను మాత్రమే అనుమతించారు. సోదాలు ప్రారంభించగానే ఆదాయ పన్ను శాఖ అధికారులతో వచ్చిన పోలీసులు, సిబ్బంది.. సోదాల సమయంలో కార్యాలయ సిబ్బంది ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేయాలని కోరారు.

ఆదాయ పన్నుకు సంబంధించి తమకున్న సమాచారానికి అనుగుణంగా అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోదాలు జరిగాయి. ఐటీ అధికారుల మరో బృందం నగరంలోని రాఘవ సంస్థ కార్యాలయంలోకి వెళ్లి సోదాలు చేపట్టింది. అక్కడ సైతం సంస్థ నిర్వహిస్తున్న కాంట్రాక్టు పనులు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఐటీ అధికారులు మీడియాను కూడా అనుమతించలేదు. ఎటువంటి సమాచారం బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. వారికి కావాల్సిన పత్రాలను అడిగి తీసుకుని.. పరిశీలించినట్లు సమాచారం. ఉదయం వచ్చిన అధికారులు సాయంత్రం వరకు అక్కడ సైతం పరిశీలన జరిపారు.
 
సబ్‌ కాంట్రాక్టర్ల ఇళ్లల్లోనూ.. 
రాఘవ సంస్థ తరఫున పలు కాంట్రాక్టు పనులను సబ్‌ కాంట్రాక్టర్లు నిర్వహించిన అశ్వారావుపేటకు చెందిన జూపల్లి రమేష్‌ ఇంటి వద్ద సైతం ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. తమకు కావాల్సిన పత్రాలను ఇవ్వాల్సిందిగా కోరి.. వాటిని పరిశీలించారు. ఇక సత్తుపల్లిలోనూ తోట గణేష్, వంగర రాకేష్‌ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. వారి వృత్తి, కాంట్రాక్టు రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు? రాఘవ సంస్థ తరఫున ఏమేమి పనులు చేశారు? అనే అంశాలను ఐటీ అధికారుల బృందం వారిని అడిగి తెలుసుకుంది. వారికి సంబంధించిన సూపర్‌ మార్కెట్, ఫైనాన్స్‌ సంస్థలకు వెళ్లి పలు పత్రాలను పరిశీలించారు. కాగా.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారంటూ మంగళవారం ఉదయం నుంచి నగరంలో ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఇంటి వద్దకు చేరుకున్నారు.

ఇవి సాధారణ తనిఖీలేనని, వ్యాపార సంస్థల్లో ఇటువంటివి సహజమేనని అక్కడి వారు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. కార్యాలయాల్లో, రాఘవ సంస్థ ద్వారా కాంట్రాక్టు పనులు నిర్వహించిన వారి ఇళ్లల్లోనూ గంటలతరబడి సోదాలు నిర్వహించిన అధికారులు ఏమేమి పత్రాలను పరిశీలించారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యాపార నిర్వహణకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు లభించాల్సిన పన్నుకు సంబంధించి ప్రధానంగా పరిశీలించినట్లు తెలిసింది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై ఆకస్మిక సోదాలు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు, పలు అనుమానాలు తలెత్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి సోదాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే అంశంపై కార్యకర్తలు చర్చించుకున్నారు.

కల్లూరులో... 

కల్లూరురూరల్‌: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న అధికారులు సాయంత్రం పొద్దుపోయే వరకు పలు పత్రాలను పరిశీలించారు. ఇంట్లో ఉన్న వివిధ డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరాలు తీసుకునేందుకు ప్రయత్నించగా.. అధికారులు అందుకు అనుమతించలేదు.

మరిన్ని వార్తలు