పాతనోట్ల మార్పిడి... ఇరకాటంలో మాజీ ప్రజాప్రతినిధి

4 Nov, 2017 16:32 IST|Sakshi

 మాజీ ప్రజాప్రతినిధి అనుచరులపై ఐటీ దాడులు?

  పెద్ద నోట్ల మార్పిడిలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తింపు 

 ఒక్కొక్కరి ఖాతాలో రూ.20లక్షల నుంచి కోటికి పైగా జమ 

పెద్ద అంబర్‌పేట: పాతనోట్ల మార్పిడి వ్యవహారం ఓ మాజీ ప్రజాప్రతినిధిని ఇరకాటంలో పడేసింది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఆ నేత అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జిల్లాలో కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి  చెందిన ఈ మాజీ ప్రజాప్రతినిధి గతేడాది జరిగిన పెద్దనోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో నగదు మార్పిడి చేశారని గుర్తించిన ఐటీ శాఖ గురు, శుక్రవారాల్లో ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. ఆ నేత బాటలో పయనించే సుమారు 40 మంది యువకులను టార్గెట్‌ చేసిన అధికారులు గురువారం వేకువ జామునుంచే ఒక్కొక్కరి ఇళ్లపై దాడులను మొదలుపెట్టి... అర్థరాత్రి వరకూ కొనసాగించినట్లు తెలిసింది. 

ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో సర్వత్రా ఇదే చర్చ కొనసాగింది. నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఆయన అనుచరుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలో ఒక్కొక్కరికీ రూ.20 లక్షల నుంచి రూ.కోటికి పైగా జమ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐటీ దాడులు చేసిన మాజీ ప్రజాప్రతినిధి అనుచరులంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పాటు చిరు ఉద్యోగాలు, కూలి పనిచేస్తున్నవారే కావడం విశేషం. ఈ దాడుల అనంతరం యువకులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధంలేదని, సదరు నాయకుడు ఆధార్, పాన్‌కార్డులు ఇవ్వమంటే ఇచ్చామని, అనవసరంగా ఇరికించారని అనుమానిత యువకులు సన్నిహితులు, ఐటీ అధికారుల వద్ద వాపోయినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు