గిరిజనులకు  మాత్రమే హక్కుంది..

19 Sep, 2019 09:34 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ గౌతమ్‌

ఐటీడీఏ పీఓ వీపీ. గౌతమ్‌

ఖమ్మంమయూరిసెంటర్‌:  షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనులకు మాత్రమే భూములపై హక్కు ఉందని, వారి దగ్గరి నుంచి ఎవరైనా గిరిజనేతరులు భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే నేరమని ఐటీడీఏ పీఓ వీపీ.గౌతమ్‌ పేర్కొన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఎల్‌టీఆర్‌(ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌) కేసు భూములకు సంబంధించి తహసీల్దార్లతో మండలాలవారీగా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనుల నుంచి ఆక్రమించుకున్న భూములను గుర్తించి, ఎల్‌టీఆర్‌ ద్వారా పరిష్కారమైన భూములను వారికి అప్పగించాలన్నారు.

గిరిజనులకు భూములను అప్పగించే సమయంలో గిరిజనేతరులు వినకుంటే వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న గిరిజనులకు వెంటనే పంచనామా చేసి.. ఆ భూములను అందేలా చూడాలన్నారు. మండలాల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే గుర్తించి.. పంచనామా చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ట్రెయినీ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఇన్‌చార్జ్‌ డీటీడీఓ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.
 
ఇంనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం..  
కాగా.. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఖమ్మం నగరంలోని నయాబజార్‌ కళాశాల ఎదుట నిర్మిస్తున్న మహిళా వసతి గృహాన్ని పీఓ పరిశీలించారు. వసతి గృహ నిర్మాణం ఆలస్యంపై ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు నెలల్లో భవన నిర్మాణం పూర్తి కావాలని, 15 రోజులకు ఒక ఫ్లోర్‌ నిర్మాణం జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణంలో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధీకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈ మురళి, ఏఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు