ఇది అంకెల గారడీ బడ్జెట్: పాయం

16 Mar, 2015 15:38 IST|Sakshi
ఇది అంకెల గారడీ బడ్జెట్: పాయం

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ మొత్తం అంకెల గారడీలా ఉందని, వాస్తవానికి విరుద్ధమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ ఎంతో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదాయ మార్గాలను ప్రభుత్వం వివరించాలని కోరారు. హామీలు బారెడు.. నిధులు మూరెడుగా బడ్జెట్ ఉందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టులకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

ఈ బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంతో పాటు నిధులు కేటాయించకపోవడం వల్ల రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, కిన్నెరసాని ప్రాజెక్టులు ఆగిపోయయాయని చెప్పారు. గత ఏడాది గృహనిర్మానానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. బిల్లులు కూడా చెల్లించకుండా పెండింగ్లో పెట్టి లబ్ధిదారులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రుణాల మాఫీ పరిధికిరాని రైతులకు నాటి సీఎం వైఎస్ ఆర్ రూ.ఐదువేలు ఇచ్చి ప్రోత్సహించారని, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు