ఇది పాఠశాలా..? మార్కెట్ యార్డా.. ?

7 May, 2015 03:11 IST|Sakshi
ఇది పాఠశాలా..? మార్కెట్ యార్డా.. ?

లింగాలఘణపురం : మండలంలోని నెల్లుట్ల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ పథకంలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, వాటి నిర్వహణ, తాగునీటి సౌకర్యంపై బుధవారం సీనియర్ కన్సల్టెంట్ సర్వశిక్ష అభియాన్, సర్వ విద్యాలయ్ నుంచి ఢిల్లీ ప్రతినిధి ఏ.ఎం చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం, వరండాల్లో ధాన్యం బస్తాలను చూసిన ఆయన ఒక్కసారిగా విద్యాలయాల్లో ఇదేం పరిస్థితి.. అనుమతి ఎవరు ఇచ్చారంటూ హెడ్మాస్టర్ ప్రభాకర్‌ను ప్రశ్నించారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో అనుమతి ఇచ్చామని, సెలవులు కావడంతో ఏర్పాటు చేసుకున్నారని హెడ్మాస్టర్ చెప్పగా మళ్లీ పాఠశాల ప్రారంభమయ్యేలోగా పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులతో చేయించవద్దని, పాఠశాల ప్రారంభమైన తర్వాత ఇక్కడి ఫొటోలను తీసి వాట్సాప్‌లో పెట్టాలని హెడ్మాస్టర్‌ను ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్‌లో మంజూరైన మరుగుదొడ్లను ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీల ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్న నెల్లుట్ల, పెంబర్తి, జనగామ ఉర్దూ పాఠశాలలో తనిఖీ చేశారు. సర్వశిక్ష అభియాన్ ఈఈ ఎం.రవీందర్‌రావు, డీడీ జె.జయశంకర్, ఏఈ రమేష్, పీఎస్ హెడ్మాస్టర్ అరుణ ఉన్నారు.
 
పాఠశాలలను సందర్శించిన ఎంహెచ్‌ఆర్‌డీ కన్సల్టెంట్

విద్యారణ్యపురి : కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) నుంచి కన్సల్టెంట్(స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ) ఎం. చౌహాన్ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణను బుధవారం పరిశీలించారు. కాజీపేటలోని బాలికల పాఠశాలను, స్టేషన్‌ఘనపూర్‌లోని సముద్రాల పీఎస్‌ను, ఎస్సీబీసీ కాలనీ పీఎస్‌ను, వెంకటాద్రిపేట యూపీఎస్, పెంబర్తి, మీదికొండ, విశ్వనాథపురం పాఠశాలను సందర్శించి అందులో మరగుదొడ్లను పరిశీలించారు. మురుగుదొడ్లు ఉన్నాయా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని ఉన్నాయనే అంశాలను పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు