గడువులోగా భగీరథ పూర్తవడం గగనమే

7 Jul, 2018 02:15 IST|Sakshi

మొత్తం పైపులైన్లలో 52 శాతమే పూర్తి

ఇంట్రా పనులదీ ఇదే స్థితి.. మేస్త్రీలు, కూలీలకు కొరత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ఆగస్టు నెలాఖర్లోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పటిలోగా పూర్తిచేస్తారనే విషయంపైనా అంచనా దొరకడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలు, గూడేలతో సహా ప్రతీ ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి.

ప్రతీ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్క్‌ ఏజెన్సీలతో భగీరథ పనులపై అప్రమత్తం చేస్తూనే ఉన్నా.. సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తికావడం లేదు. రాష్ట్రంలో 49 వేల కిలోమీటర్ల పైపులైన్లు మిషన్‌ భగీరథకు అవసరమవుతున్నాయి. ఇప్పటిదాకా 52 శాతం అంటే 25 వేల కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. కేసీఆర్‌ నిర్దేశించిన గడువు ఆగస్టులోగా మిగిలిపోయిన 48 శాతం పనులను పూర్తిచేయడం, తాగునీటిని అందించడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.

ప్రతీ ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని సీఎం ప్రకటించిన నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే సంకేతాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్‌ భగీరథను గడువులోగా పూర్తి చేయలేకున్నా, వీలైనంత వేగంగా పూర్తిచేయడం ఎలా అనే దానిపై ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మిగిలిన 24 వేల కిలోమీటర్ల పైపులైన్లను పూర్తి చేయడానికి మరో నాలుగైదు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు.  

ఇంట్రా పనులదీ ఇదే స్థితి...
ప్రధాన పైపులైన్లు పూర్తికావడానికి కనీసం నాలుగు నెలలైనా కావాలని అధికారులు చెబుతుండగా, ఇంట్రా పనులు(గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు) కూడా పూర్తికాలేదు. రాష్ట్రంలోని సుమారు 25వేల గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలు చేపట్టాలని ‘భగీరథ’కింద నిర్ణయించారు. వీటిలో అంతర్గత పైపులైన్లు 50 వేల కిలోమీటర్ల మేరకు వేయాల్సి ఉంది. ఈ పనులను ఆయా గ్రామ, మండలాల్లోని స్థానిక కాంట్రాక్టర్లకు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్‌) అప్పగించింది.

అయితే పనులను దక్కించుకోవడానికి పోటీలు పడిన కాంట్రాక్టర్లు, వాటిని పూర్తిచేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో వీటిని పూర్తిచేయడానికి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో కూలీలు, మేస్త్రీలు దొరకడం లేదని గ్రామీణ స్థాయిలోని స్థానిక కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఇప్పటిదాకా వీటిలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇంకా ఇంట్రా పైపులైన్ల పనులనే మొదలుపెట్ట లేదని తెలుస్తోంది.

పలు గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కసారిగా గ్రామాల్లో ఇంట్రా పనులు ప్రారంభం కావడంతో మేస్త్రీలు, కూలీలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయ పనులు కూడా ఉండటంతో కూలీలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్టుగా కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు టెండర్లు వేసినప్పటి ధరలకు, ఇప్పటి ధరలకు మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడిందని కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో ఇసుక కొరతతో పాటు స్టీల్‌ ధరలు, సిమెంటు ధరలు చాలా పెరిగాయని కాంట్రాకర్లు మొర పెట్టుకుంటున్నారు. అటు కూలీల కొరత, ఇటు ధరల్లో భారీ పెరుగుదలతో కొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కాంట్రాక్టర్లు వెనుకాడి చేతులెత్తేస్తున్నట్టుగా చెబుతున్నారు. పనులు తీసుకున్న కాంట్రాక్టర్లపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇంట్రా పనులైతే ఆరునెలలైనా పూర్తయ్యే పరిస్థితి చాలా గ్రామాల్లో లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు