ఐదు అడుగులు తగ్గిన సాగర్ నీటిమట్టం

12 Oct, 2014 03:25 IST|Sakshi

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. కృష్ణానది ఎగువ నుంచి  ఇన్‌ఫ్లో తగ్గింది. ఆయకట్టు అవసరాలకు కృష్ణాడెల్టా, కుడి, ఎడమ, ఏఎమ్మార్పీ,వరదకాల్వలకు నీటిని వదులుతున్నారు. దీంతో ఈ 18 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు నీటిమట్టం ఐదు అడుగుల మేర తగ్గింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.10 అడుగుల మేర ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంది. గత ఏడాది  ఇదే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం  589.10 అడుగులు. ఈ ఏడు సాగర్ జలాశయానికి వరద నీటి రాక ఆలస్యంగా మొదలైంది. గత నెల 15వ తేదీ నాటికి సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో వారంరోజులపాటు సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఎగువనుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ జలాశయానికి 28,323 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సాగునీటి అవసరాలకు సాగర్ నుంచి 38,340 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.  
 

మరిన్ని వార్తలు