వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అనర్థమే

18 Oct, 2016 03:38 IST|Sakshi
వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అనర్థమే

జేఏసీ చైర్మన్ కోదండరాం
ఈ నెల 23న రైతు దీక్ష...పోస్టర్ ఆవిష్కరణ
నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని వదులుకుంటే ఆహార సంక్షోభంతో అనర్థం తప్పదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. రైతు సమస్యలపై ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే రైతు దీక్ష పోస్టర్‌ను జేఏసీ, రైతు జేఏసీ నేతలతో కలసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ సరళీకరణ విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతును ఆదుకోవాలనే పట్టింపు ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

పారిశ్రామికాభివృద్ధికి సమాంతరంగా వ్యవసాయరంగానికి చేయూతనందించాలని సూచించారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజంలో అశాంతి, అస్థిరత తలెత్తుతాయని హెచ్చరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై చేతివృత్తులు కూడా ఆధారపడి ఉన్నాయనే అంశాన్ని పాల కులు విస్మరిస్తున్నారని అన్నారు. చెరువుల్లోకి నీరు రావడంతో రైతులు గొర్రెలు కోసుకుంటూ, సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చేస్తున్న వాదన సరైందికాదని కోదండరాం అన్నారు. నీళ్లు రావడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని,

ఆదాయం పెరగకుండా సంతోషం ఎక్కడిది?
రైతు అందాల్సిన ఆదాయం గురించి ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టి,  మేలైన విత్తనాలను అందించకుండా, సాగుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చకుండా, ఎరువులను సకాలంలో ఇవ్వకుండా, మార్కెట్‌లో దోపిడీని అరికట్టకుండా, ఆదాయం పెరగకుండా రైతు సంతోషంగా ఎలా ఉంటాడని కోదండరాం ప్రశ్నించారు. ప్రాధాన్యరంగమైన వ్యవసాయానికి ఒక విధానాన్ని, నకిలీ విత్తనాలను అరికట్టడానికి విత్తనచట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో రైతుకు సగటున 94 వేల రూపాయల అప్పుందన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

 రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని విమర్శించారు. కావేరి, పయనీర్, మోన్‌శాంటో, నూజివీడు వంటి పెద్దపెద్ద కంపెనీలు నకిలీ విత్తనాల సరఫరా చేసినా కేసులు పెట్టడం లేదన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే ఏటా రైతులు నష్టపోతారని ఆయన హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీ అతిపెద్ద కుంభకోణమని రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు విమర్శించారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుంటే వ్యవసాయం దెబ్బతింటుందని హెచ్చరించారు. సమావేశంలో రైతు జేఏసీ నేతలు కన్నెగంటి రవి, పిట్టల రవీందర్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు