ఎవరి దాడులకూ భయపడం: కోదండరాం

10 Nov, 2016 01:32 IST|Sakshi
ఎవరి దాడులకూ భయపడం: కోదండరాం

సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న తమపై టీఆర్‌ఎస్ నేతలు, ప్రభుత్వం దాడులు చేసినా భయపడబోమని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మానుకోవాలన్నారు.ఎవరితోనూ రహస్య మంతనాలు జరపాల్సిన అవసరం తనకు లేదని, జూన్ 16న వారణాసిలో, 27న ఇందిరా పార్క్ దగ్గర ఉన్నానన్నారు. తమపై విమర్శలు చేసిన వారిపై కోపం లేదని... వారితో ఆరోపణలు చేయించిన వారికే సమాధానం చెబుతున్నామన్నారు. భూనిర్వాసితుల హక్కులను పరిరక్షించాలని కోరినా, రైతుల కరువు కష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి స్పష్టమైన ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోలేదని కోదండరాం విమర్శించారు.
 
 నూతన తెలంగాణలో తాము ఆశించింది ఇది కాదన్నారు. తమకు స్వప్రయోజనాలు లేవని, డీపీఆర్‌లు ప్రకటించి ప్రాజెక్టుల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం ఘనంగా ఉన్నా పథకాలకు మాత్రం చెల్లింపులు చేయట్లేదని...రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. పాలకులు సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని కోదండరాం సూచించారు. ఈ నెల 11న మంథనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా 13న వైద్యరంగ సమస్యలపై హైదరాబాద్‌లో సదస్సును, 20న సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్‌ల సమస్యలపై హైదరాబాద్‌లో సదస్సును నిర్వహిస్తామని తెలిపారు.

 

మరిన్ని వార్తలు