యురేనియం కలకలం!

6 May, 2020 11:43 IST|Sakshi

నల్లమల సందర్శనకు వచ్చిన అటవీశాఖ ఉన్నతాధికారులు

అడ్డుకున్న జేఏసీ నాయకులు

మాట్లాడకుండానే వెనుదిరిగిన అధికారులు

పదిహేనుమందిపై కేసు

అమ్రాబాద్‌: నల్లమలలో మళ్లీ యురేనియం తవ్వకాల కలకలం మొదలైంది. గతేడాది మూడు నెలల పోరాటం అనంతరం నల్లమలలో యురేనియం సర్వేకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రోడ్లు, బోర్లు వేస్తూ  యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల పరిశీలన  
అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని అడవిని, అడవిలో వేసిన రోడ్లను పరిశీలించేందుకు మంగళవారం అటవీశాఖ ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఏకే సిన్హా, జిల్లా అటవిశాఖ అధికారి జోజీ వచ్చారు. వీరిని నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు అమ్రాబాద్‌ సమీపంలోని ఎల్మపల్లి స్టేజీ వద్ద వారిని అడ్డుకున్నారు. అంతకుముందు నల్లమల యురేనిం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకుడు నాసరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా యురేనియం తవ్వకాలకు అనుమతిస్తే ఊరుకోమని నిలదీశారు. తవ్వకాలకు అనుమతులిచ్చి నల్లమలోని ప్రజలు, వన్యప్రాణులు, నదీ జలాలను నాశనం చేయొద్దని కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ బీసన్న, ఎస్‌ఐ పోచయ్య అక్కడికి వచ్చి జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారులతో కలిసి ముగ్గురిని పంపే ప్రయత్నం చేశారు. అటవీశాఖ అధికారులు కొద్దిసేపు అమ్రాబాద్‌ అటవీశాఖ కార్యాలయంలో వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. అధికారులు ఎవరూ మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.  

పదిహేనుమందిపై కేసు
అధికారులను అడ్డుకున్న నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు నాసరయ్యతో నాటు మరో పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులను అడ్డగించడం సరైంది కాదని కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా