జడ్చర్లలో రికార్డు సత్యం..!

24 Nov, 2018 09:33 IST|Sakshi

జడ్చర్ల నుంచి 1994లో 53,779 ఓట్ల మెజారిటీ 

అత్యల్పం సుధాకర్‌రెడ్డి పేరిట.. 1989లో 1,056 ఓట్ల తేడాతో గెలుపు 

అత్యధికంగా 72వేల ఓట్లు పోలైంది ఎర్ర శేఖర్‌కు...  

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సారు ఎన్నికలు జర్గగా ఎర్ర సత్యం అలియాస్‌ మరాఠి సత్యనారాయణ అత్యధిక మెజారిటీ సాదించి రికార్డు నెలకొల్పారు. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడింది. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సప్పపై 53,779ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు.

ఆ తర్వాత ఏ అభ్యర్థి కూడా ఈ రికార్డును చేరుకోలేకపోయారు. ఇక 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి 1,056 ఓట్ల తేడాతో విజయం సాదించారు. ఆయన సమీప టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఇక మెజారిటీ విషయానికి వస్తే ఎర్ర శేఖర్‌ అలియాస్‌ ఎం.చంద్రశేఖర్‌ పేరిట రెండో రికార్డు నమోదైంది.

1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 47,735 ఓట్ల మెజారిటీతో ఆయన సమీప అభ్యర్థి సుధాకర్‌రెడ్డిపై గెలుపొందారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలైన రికార్డు కూడా ఎర్ర శేఖర్‌ పేరిటే ఉంది. 1996లో ఆయనకు ఏకంగా 72వేల ఓట్లు పోలయ్యాయి. ఒక అభ్యర్థికి ఇన్ని ఓట్లు రావడం జడ్చర్లలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. 


రికార్డులపై లక్ష్మారెడ్డి దృష్టి
జడ్చర్ల నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఎర్ర శేఖర్‌కు దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ లక్ష్మారెడ్డి పలు రికార్డులపై దృష్టిసారించారు. మూడో పర్యాయం గెలవడం ద్వారా శేఖర్‌ రికార్డును సమం చేయటంతో పాటు ఎర్ర సత్యంకు దక్కిన మెజారిటీ దాటేందుకు కృషి చేస్తున్నారు. అలాగే, అత్యధికంగా ఓట్లు సాధించే రికార్డుపై ఆయన దృష్టి సారించి విస్తృత ప్రచారం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు