‘విద్యుత్‌ బిల్లు’ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి

4 Jul, 2020 02:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే విద్యుత్‌ సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లుతో రాష్ట్రాల హక్కులను హరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున మంత్రి జగదీశ్‌ రెడ్డి పాల్గొని తమ అభ్యంతరాలను తెలియజేశారు.

అనంతరం ఆయన విద్యుత్‌ సౌధలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా కేంద్రం ఒక్క లైనును కూడా మార్చలేదన్నారు. రాష్ట్రాల ఈఆర్సీల నియామకం విషయంలో మార్పులు చేశామని కేంద్రం అంటోంది కానీ, చేతల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. ఈ బిల్లుతో భవిష్యత్తులో పేదలు విద్యుత్‌ సబ్సిడీలు కోల్పోయే ప్రమాదముందన్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన డిస్కంలకు కేంద్రం అందిస్తున్న రుణాలకు సంబంధించిన వడ్డీలను 9.5% నుంచి 8.5 శాతానికి తగ్గించాలన్నారు. మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్‌ కేంద్రంలోని 270 మెగావాట్ల రెండో యూనిట్‌ శుక్రవారం నుంచి ఉత్పత్తి ప్రారంభించిందని, త్వరలో మూడో యూనిట్‌లో సైతం ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు