ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి  సన్యాసుల్లో కలవడం ఖాయం

11 Nov, 2018 15:51 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు మావే

మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి,దామరచర్ల(మిర్యాలగూడ): ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పెద్దలు ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిలను ప్రజలు సన్యాసంలో కలిపేస్తారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి దామరచర్లలో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్‌ పెద్ద నాయకులు చేసింది శూన్యమన్నారు. జానా తన 35 ఏళ్ల పదవీ కాలంలో 17 ఏళ్లు మంత్రిగా జిల్లాకు చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఫ్లోరిన్, కరువు పెరుగుతూ ఉంటే పదవిని పట్టుకొని పాకులాడాడు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు అయినా సాధించాడా అని ప్రశ్నించారు. తన కొడుకు ఎమ్మెల్యే టికెట్‌ కోసం జానారెడ్డి.. చంద్రబాబును దేబురించడం దారుణమన్నారు. ఎడమ కాల్వ రైతాంగానికి జానా చేసింది ఏమీ లేదని, తన సొంత నియోజక వర్గంలోని పొలాలు బీడులుగా మారుతున్నా, మేజర్లకు నీటి విడుదల కాకున్నా  నోరు మెదపలేదన్నారు.

ఏడున్నర ఏళ్లపాటు ఎడమకాల్వను ముంచి కుడి కాల్వకు నీళ్లు తీసుకెళ్తున్నా అప్పటి మంత్రులు జానా, ఉత్తమ్‌లు చోద్యం చూశారన్నారు. కేసీఆర్‌ కోదాడ నుంచి పాదయాత్ర చేసి సాగునీటిని సాధించుకున్నాడన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డెడ్‌ స్టోరేజ్‌ ఉన్నా మన హక్కుల మేరకు ప్రతి నీటి చుక్కనూ తెచ్చి సాగు భూములకు అందించామన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను దామరచర్లలో నిర్మిస్తుంటే చూసి ఓర్వలేక దానిని మూసివేస్తామని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించడం దారుణమన్నారు. స్వయంగా రాహుల్‌ గాంధీ వచ్చినా పవర్‌ ప్లాంట్‌ను ఆపేది లేదని, పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. మూడేళ్లలో వ్యవసాయానికి 24గంటల కరెంట్‌ ఇచ్చిన ఘనత దేశ చరిత్రలో తమ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో పేర్కొన్న విధంగా మేనిఫెస్టోను అమలు చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 సీట్లు తాము గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 తెలంగాణపై చంద్రబాబు కుట్ర  

తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తుండని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ పనిచేయకుండా కాళ్లలో కట్టెలు పెడుతూ బాబు అడ్డుకుంటున్నాడన్నారు. బాబు ఇచ్చే రూ.500 కోట్లకు ఆశపడి, సీఎం పదవి కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, జానారెడ్డిలు పడిగాపులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మిర్యాలగూడ అసెంబ్లీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, డి.వెంకటేశ్వర్లుగౌడ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు