మీడియా అడ్డుకుంటోంది

14 Dec, 2014 02:45 IST|Sakshi
మీడియా అడ్డుకుంటోంది

కొన్ని పత్రికలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజలకు దూరం కావాల్సి వస్తుందని రాష్ట్ర విద్యా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చి లక్ష్య సాధనకు పాటుపడే సమాచార ప్రజా సంబంధాల వ్యవస్థను అట్టడుగు స్థాయి నుంచి పటిష్టపరచడం ఎలా?’ అనే అంశంపై నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ , పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు అందాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, వాస్తవాలు ప్రజలకు చేరకుండా మీడియా అడ్డుకుంటోంది. కొన్ని పత్రికలు అదే పనిగా వ్యతిరేక కథనాలతో ప్రభుత్వంపై బురదజల్లజూస్తున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ అంటే సరిపోదని, ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహా దారు  కేవీ రమణాచారి అన్నారు. ప్రజా సంబంధాల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలంగాణ, ఏపీ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. మీడియాకు ప్రత్యేక ఎజెండా ఉండదని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు