‘ఓయూకు వెళ్లలేని స్థితిలో కేసీఆర్‌’

11 Jun, 2017 16:23 IST|Sakshi
‘ఓయూకు వెళ్లలేని స్థితిలో కేసీఆర్‌’

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కక్ష కట్టిన్నట్లు కనిపిస్తుందని కాంగ్రెస్‌ నేత, శాసనసభ మాజీ విప్‌ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఓయూలో ఎవరు మీటింగ్ పెట్టొద్దనే జీవో తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓయూకు వెళ్తే రాళ్లు, చెప్పులు పడుతాయన్నారు. ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందని, అలాంటి యూనివర్సిటీపై ఆంక్షలు పెట్టడం దుర్మార్గమన్నారు.

ఉస్మానియాలో రాహుల్ గాంధీతో సభ పెడతానని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న యూనివర్సిటీకి వెళ్లలేని కేసీఆర్ ఒక ముఖ్యమంత్రేనా అని ప్రశ్నించారు. ఉత్తమ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో సభ పెట్టి తీరుతామన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో కేసీఆర్‌కి విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవోని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.