హైదరాబాద్‌ వస్తా.. ఘెరావ్‌ చేస్తా

14 Oct, 2019 14:03 IST|Sakshi

మంత్రి పువ్వాడకు జగ్గారెడ్డి హెచ్చరిక

సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీని విలీనం చేస్తే కార్మికులతో పాటు తాను కూడా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేంద్ర గౌడ్‌లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మ బలిదానం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫోటోలకు పాలు పోసి పూజలు చేసిన ఆర్టీసీ కార్మికులే నేడు ఆయనను నిందించే పరిస్థితి రావడం విచారకమన్నారు.

ఆర్టీసీ విలీనంపై రేపటికల్లా సీఎం కేసీఆర్‌ను ఒప్పించాలని రవాణా శాఖ మంత్ర పువ్వాడ అజయ్‌కుమార్‌ను డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిని ఒప్పించకపోతే సంగారెడ్డి డిపోకు చెందిన 600 మంది కార్మికులతో హైదరాబాద్ తరలివచ్చి మంత్రిని ఘోరావ్‌ చేస్తానని హెచ్చరించారు. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: ‘కళ్లల్లో పెట్టుకుని చూసుకున్నా.. మళ్లీ ఆయన నాకు కావాలి’)

జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే, ఐజెయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. విలేకరుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు