చించావు పో రష్మిక!

21 Feb, 2020 02:52 IST|Sakshi

జగిత్యాల కలెక్టర్‌ ట్విట్టర్‌ ఖాతా నుంచి పోస్ట్‌

రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌ అయిన ట్వీట్‌

పోస్ట్‌ పెట్టలేదన్న కలెక్టర్‌

ఎస్పీ సింధూశర్మకి ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సినీ నటి రష్మిక ఫొటోలపై జగిత్యాల కలెక్టర్‌ ట్విట్టర్‌లో కామెంట్‌ చేసినట్లు కొన్ని టీవీ చానెళ్లు, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. కలెక్టర్‌ హోదాలో ఉన్న అధికారి ఓ నటిపై కామెంట్‌ చేయడం ఏమిటనే విమర్శలకు దారితీసింది. బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నటి రష్మికకు కలెక్టర్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా (collector @jagtial) నుంచి ‘చించావు పో రష్మిక’అనే కామెంట్‌ పోస్ట్‌ అయింది. దీంతో ట్విట్టర్‌ ఖాతాదారులు అవాక్కయ్యారు. సోషల్‌ మీడియాలో దుమారం లేపింది. దీంతోపాటు పలు మీడియా చానళ్లలో ఈ వార్త ఒకేసారి రావడం అధికార వర్గాలను ఇబ్బందికి గురి చేసింది. ఈ పోస్టింగ్‌ వెళ్లిన సమయంలో కలెక్టర్‌ రవి.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో ఓ అధికారిక సమావేశంలో పాల్గొనడం గమనార్హం. కాగా, 15 రోజుల క్రితమే కలెక్టర్‌గా రవి బాధ్యతలు చేపట్టారు.  ఆయన ట్విట్టర్‌ ఖాతాను ఉపయోగించడం లేదు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన కలెక్టర్‌ హయాంలో అధికారిక ట్విట్టర్‌ ఖాతాను కలెక్టరేట్‌ ఉద్యోగి ప్రసాద్‌ ఉపయోగించేవాడని సమాచారం.

నాకు ట్విట్టర్‌ ఖాతానే లేదు: కలెక్టర్‌  
ఈ విషయంపై కలెక్టర్‌ రవిని వివరణ కోరగా తనకు ట్విట్టర్‌ ఖాతానే లేదని, ట్విట్టర్‌ ఉపయోగించేంత సమయం కూడా లేదని చెప్పా రు. బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు బ్రహ్మోత్సవాల కు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్పీ సింధూశర్మకు ఫిర్యాదు చేశానన్నారు. గతంలో కలెక్టర్‌కు ట్విట్టర్‌ ఖాతా ఉండేదని, ఆ ఖాతాను ప్రసాద్‌ అనే ఉద్యోగి చూస్తున్నాడని, అతనిని విచారించామని తెలిపారు. వేరే ఉద్యోగులు చేశారా అనే దానిపై కూడా విచారణ చేపట్టామన్నారు. కాగా, ఈ ఘటనపై ఎస్పీ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇద్దరు కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై వేటు  
కలెక్టర్‌ రవి ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేసినట్లు గుర్తించి జగిత్యాల డీఆర్వో అరుణశ్రీ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సైబర్‌ నేరం కింద పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం సైబర్‌ విభాగానికి పంపించారు. కాగా, కలెక్టర్‌ రవి ట్విట్టర్‌ ఖాతాను నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ప్రసాద్, మమతలను తొలగించారు.

ట్విట్టర్‌ పోస్టు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా