శవాలకూ రక్షణ కరువు

2 Dec, 2019 08:44 IST|Sakshi
మార్చురీ

ఇరుకైన పోస్టుమార్టం గది

ఫ్రీజర్‌లో రెండు మృతదేహాలకే చోటు 

మూడో శవం వస్తే వరండాలోనే..

పట్టించుకోని ఉన్నతాధికారులు 

సాక్షి, జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధానాస్పత్రిలో శవపరీక్షలకు కష్టకాలం వచ్చింది. జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ గది చిన్నగా ఉండడం, ఫ్రీజర్‌ సైతం ఒకటే ఉండడం ఇబ్బందిగా మారింది. సెలవు దినాల్లో రెండుకు మించి మృతదేహాలు వస్తే భద్రపరచడం కూడా కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో భద్రపరచగా.. ఎలుకలు తిన్నాయి. అంతేకాకుండా ఫ్రీజర్‌లోనూ రెండు మృతదేహాలను మాత్రమే భద్రపరిచే అవకాశం ఉంది. అది కూడా ఒక దానిపైన మరో శవాన్ని ఉంచాల్సి వస్తుండడంతో మృతుల బంధువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.   

జిల్లా ఆస్పత్రిలో ఒకే ఫీజర్‌ 
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. ఏదైన ప్రమాదం జరిగి చనిపోతే పోస్టుమార్టం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఆస్పత్రిని అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రస్తుతం జిల్లాగా అవతరించడం, జనాభా పెరగడం తో ఆస్పత్రి సరిపోవడం లేదు. దీంతో పోస్టుమార్టం గది సైతం చిన్నగా మారింది. ఈ గదిలో రెండు ఫ్రీజర్లతోపాటు ఒక బల్ల మాత్రమే ఉన్నా యి. ఈ ఆస్పత్రికి వారంలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలు వస్తుంటాయి. సాయంత్రం వేళ పోస్టుమార్టం చేయకపోవడం, రాత్రి వేళ  చనిపోయిన వారిని ఇక్కడే తేవడంతో మృతదేహాలను పోస్టుమార్టం గదిలో భద్రపరుస్తుంటారు. రెండు మృతదేహాలకన్నా ఎక్కువగా ఉంటే బయట వరండాలోనే వేయాల్సిన దుస్థితి.  

అన్నీ అసౌకర్యాలే.. 
పోస్టుమార్టం గదికి ఒక భవనంతోపాటు మృతదేహాలను భద్రపర్చేందుకు ఒక గది, కుళ్లిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచేందుకు ఒక గది ఉండాలి. కానీ ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి. ఇందులో నిరంతరం నీటి సరఫరాతోపాటు శుభ్రం చేసేందుకు వాక్యుమ్‌క్లీనర్లు ఉండాలి. ఇవన్నీ కనిపించడం లేదు. పరికరాలు సైతం స్టీల్‌తో చేసినవి ఉండాలి. గది లోపలికి గాలి వెళ్లేందుకు ఎగ్జిట్‌ఫ్యాన్లు సైతం ఉండాలి. కానీ ఈ గది పురాతనమైనది కావడంతో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా ఇతర సామగ్రిని సైతం ఇందులోనే వేస్తున్నారు. శవ పంచనామా రాసేందుకు ప్రత్యేక గది లేదు.   

మరొకటి ఎప్పుడో ? 
జగిత్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ ఆ స్థాయిలో వసతులు కల్పించలేదు. మృతదేహాలు సైతం దాదాపు నెలకు 30కి పైగానే వస్తుంటాయి. వీటన్నింటికి పోస్టుమార్టం చేసేందుకు ఒకే గది ఉంది. గతంలో అధికారులు పరిశీలించినప్పటికీ స్థలం లేదని, ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైన అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మరో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

స్థలం లేకనే ఇబ్బందులు  
ప్రస్తుతం ఉన్న పోస్టుమార్టం గదికి మరమ్మతులు చేయిస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరో గదిని ఏర్పాటు చేయాలంటే స్థలం లేదు. ప్రస్తుతం ధరూర్‌ క్యాంప్‌లో నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనంలోకి గైనిక్‌ విభాగం వెళ్తే ఇబ్బందులు తొలగుతాయి. ఇటీవల మృతదేహాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.  
– సుదక్షిణాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు