తాగారో.. బేడీలే

26 Feb, 2018 08:22 IST|Sakshi

డ్రంకెన్‌ డ్రైవ్‌తో తరచూ ప్రమాదాలు

తనిఖీల్లో పట్టుబడుతున్న మందుబాబులు

కళ్లెం వేసేందుకు పోలీసుల కఠిన వైఖరి  

నిబంధనల అమలుకు పక్కాగా సన్నాహాలు

హైవేలపై పెట్రోలింగ్‌ వాహనాలతో గస్తీ ముమ్మరం

జైలు, జరిమానా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు వంటి శిక్షలు

నివారణకు అవగాహన కార్యక్రమాలు

సంగారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనాలను నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. వారి వల్ల ఇతరులకూ ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నిండిన సంఘటనలు కోకొల్లలు. యువత ఎక్కువగా మద్యానికి బానిసై వాహనాలు నడిపి ప్రమాదాల కొని తెచ్చుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిలిస్తున్నారు. స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసరా పింఛన్లపై అధ్యయనం చేశారు. వీటిలో వితంతు పింఛన్‌ పొందుతున్న వారిలో 35 ఏళ్లలోపు మహిళలు ఎక్కువగా ఉన్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం వల్లే వారి కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో వాటి నియంత్రణ కోసం డ్రంకెన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు
రోజు రోజుకూ ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరగడంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరు రింగురోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 65వ జాతీయ రహదారి సంగారెడ్డి జిల్లా మీదుగా వెళుతుండడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి రామచంద్రపురం, పటాన్‌చెరువు, బీడీఎల్‌ భవనాలు, సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, జహీరాబాద్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. మెదక్‌ జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉండటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్గీగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పెద్దపెద్ద గూడ్స్‌ లారీల డ్రైవర్లు మద్యం తాగి నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాళ్లకల్, తూప్రాన్‌ దగ్గర్లో నాగులపల్లి చౌరస్తా చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల పక్కనే దాబాల్లో మద్యం సిట్టింగ్‌ ఉండటం ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయని చెప్పొచ్చు.

అవగాహన సదస్సులతో..
జిల్లాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలను నివారించడానికి పోలీస్‌ యంత్రాంగం చొరవ చూపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లకు, ఇతర ప్రైవేట్‌ వాహనదారులకు ఆర్టీఏ అధికారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, సదస్సులను నిర్వహిస్తున్నారు. 

సిద్దిపేటలో ప్రత్యేక కార్యక్రమాలు..
సిద్దిపేట జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం ‘‘కనువిప్పు’’ అనే కార్యక్రమం పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డ్రంకెన్‌ డ్రైవ్, రైతు ఆత్మహత్యలు, బాల్యవివాహాలు, మూఢ నమ్మకాలు, నకిలీ బంగారు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కళా బృందాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 105 గ్రామాల్లో అవగాహన కల్పించారు. దీని ద్వారా చాలా వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గాయని అధికారులు తెలిపారు.

పర్సంటేజీ ప్రకారమే శిక్ష  
డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సంటేజీ వస్తే కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తారు. జడ్జి తీర్పునుబట్టి శిక్ష ఖరారవుతుంది. 30లోపు పర్సంటేజీ వస్తే పోలీసులే   జరిమానాలతోపా టు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిస్తారు. మెదక్‌ జిల్లాలో ఈ ఏడాది 23 మంది మద్యం తాగి వాహనాలు నడిపి జైలు కు వెళ్లారు.సంగారెడ్డిలో 2017లో 299 మంది జైలుకు వెళ్లారు.

పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరి«ధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తూ  మద్యం తాగి వాహనాలు నడపకుండా పర్యవేక్షిస్తున్నాం. పట్టుబడిన మద్యం ప్రియులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. – చందనదీప్తి,  మెదక్‌ ఎస్పీ

చాలా వరకు కేసులు తగ్గాయి
డ్రంకెన్‌ డ్రైవ్‌ నిరంతరం కొనసాగించడంతో మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. మద్యం తాగి వాహనాలు నడపకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హైవేలపై  పెట్రోలింగ్‌ వాహనాలతో గస్తీలు ము మ్మరం చేశాం.–చంద్రశేఖర్‌రెడ్డి, సంగారెడ్డి ఎస్పీ

మరిన్ని వార్తలు