కన్నీరు పెట్టిన జైనా..

6 May, 2018 07:21 IST|Sakshi
తల్లీ పిల్లల అంత్యక్రియలు..

ముగిసిన తల్లీ పిల్లల అంత్యక్రియలు

ఒకే పాడెపై అన్నాచెల్లెలి శవయాత్ర

శోకసంద్రమైన గ్రామం

నిప్పుపట్టిన తండ్రి

సాక్షి, ధర్మపురి: జైన కన్నీరుపెట్టింది.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తల్లీపిల్లల అంత్యక్రియలకు శనివారం ఊరంతా కదిలింది. ఒక పాడెపై తల్లి.. మరో పాడెపై ఇద్దరు పిల్లల మృతదేహాలను ఉంచి నిర్వహించిన శవయాత్ర అందరినీ కన్నీరు పెట్టించింది. తల్లీపిల్లలకు ఊరంతా కంటతడితో వీడ్కోలు పలికింది. జైనా గ్రామానికి చెందిన టేకుమట్ల సత్తవ్వ(32) దోహాఖతర్‌ నుంచి స్వగ్రామానికి వస్తున్న భర్తను తీసుకొచ్చేందుకు తన కుమారుడు శ్రావణ్‌(12), కూతరు శాలిని (10)తో వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే.

వీరితోపాటు ధర్మపురికి చెందిన కారు డ్రైవర్‌ జెట్టి రాజ్‌కుమార్‌(24) కూడా దుర్మరణం చెందాడు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు స్వగ్రామానికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. జైనాలో తల్లీపిల్లల మృతదేహాలను చూసేందుకు ఊరంతా కదలివచ్చింది.

ఒకే పాడెపై అన్నాచెల్లెలు..
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు సత్తవ్వ మృతదేహాన్ని ఒక పాడెపై, అన్నాచెల్లెలు శావ్రణ్, శాలిని మృతదేహాలను ఒకపాడెపై ఉంచి అంతిమాయాత్ర నిర్వహించారు. ఈదృశ్యం అందరినీ కదిలించింది. దోహాఖతర్‌ నుంచి వచ్చిన సత్తవ్వ భర్త రాజేశ్‌ ముగ్గురికీ నిప్పుపెట్టాడు. గ్రామ శివారులోని గోదావరి నది వరకు అంతిమయాత్ర సాగింది.

ముగ్గురి మృతదేహాలను నదిలో ఖననం చేశారు. కాగా, ధర్మపురిలో కారు డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం రాత్రి పరామర్శించారు. శనివారం జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పరామర్శించారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు

మరిన్ని వార్తలు