హైదరాబాద్‌ యూటీ కాకుండా అడ్డుకుంది జైపాలే 

29 Jul, 2019 02:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) చేయాలన్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీల డిమాండ్‌కు అడ్డుగోడగా నిలబడి దాన్ని అడ్డుకోవడంలో ఎస్‌.జైపాల్‌రెడ్డి పాత్ర మరువలేనది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉభయ సభలు పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ– 2013 బిల్లును అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కేబినెట్‌ ఆమోదం తెలిపేందుకు సమావేశమైన సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. సీమాంధ్ర ప్రజలకు పూర్తిరక్షణ కవచంగా ఉంటామని జైపాల్‌ ఇచ్చిన ధీమాతో కేబినెట్‌ వెనక్కి తగ్గి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని యూటీగా ప్రకటిస్తే ఇబ్బంది ఉండదని అన్నారు. దీన్ని కేబినెట్‌లో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ మంత్రి జైపాల్‌రెడ్డి తీవ్రంగా అడ్డుకున్నారు.

ఎవరో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కుల మేరకు హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు రక్షణ ఉంటుంద న్నారు. యూటీ అవసరం లేకుండానే హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా చేర్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌(3) అధికరణ కేంద్రానికి సర్వాధికారాలను కల్పిస్తోందని చెప్పారు. జైపాల్‌ వాదనలతో ఏకీభవించిన కేబినెట్‌ యూటీకి మద్దతివ్వలేదు. 

మరిన్ని వార్తలు