గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి భౌతికకాయం

29 Jul, 2019 11:01 IST|Sakshi

ఒంటిగంటలోపు అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచన

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. 

గాంధీభవన్‌లో జైపాల్‌కు ఘన నివాళి
కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్‌ రెడ్డికి ఘనంగా అంజలి ఘటించారు. గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ...‘జైపాల్‌రెడ్డి మన మధ్య లేరు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అన్నారు.  మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా జైపాల్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1964 నుంచి జైపాల్‌ రెడ్డి తనకు తెలుసునని, విద్యార్థి దశ నుంచే పరిచయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. కాగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్‌ వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు