ఆ పుస్తకం.. ఆయన ఆలోచన 

29 Jul, 2019 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘టెన్‌ ఐడియాలజీస్‌ ద గ్రేట్‌ అసిమెట్రీ బెట్వీన్‌ అగ్రేరియనిజం అండ్‌ ఇండస్ట్రియలిజం’అనే పుస్తకం ద్వారా జైపాల్‌రెడ్డి తన ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రతిష్టాత్మకమైన పుస్తకం. పాత, కొత్త తరం రాజకీయాల్లో మునిగి ఉన్న నాయకుడు రచించినది. కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన సుదీర్ఘ అనుభవం పొందారు. ఒక సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకుడు జైపాల్‌రెడ్డి. ఆయన తన పుస్తకం ముందుమాటలో ’ఇటీవలి దశాబ్దాల్లో సైద్ధాంతిక చర్చలు మరుగునపడ్డాయి. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది’అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పునరుజ్జీవనం, మానవతావాదం, సంస్కరణలు, శాస్త్రీయ విప్లవం అనే 4 గొప్ప ఉద్యమాలు ఏయే దేశాలను ఎలా తీర్చిదిద్దాయో పుస్తకంలో విశదీకరించారు. అందులో భాగంగా పది భావజాలాలను ఆయన నొక్కిచెప్పారు.

జాతీయవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, పరిణామాత్మక సోషలిజం, విప్లవాత్మక సోషలిజం, స్త్రీ వాదం, పర్యావరణ వాదం, అణు, శాంతి వాదం, ప్రపంచ వాదం వీటిపై తన అభిప్రాయాలను తెలిపారు. పారిశ్రామిక విధానం ఎలా వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందో వివరించారు. జాతీయ వాదంపై రాసిన అధ్యాయంలో భారతదేశం ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దేశాల సాంస్కృతిక, మత, భాష, జాతి, భౌగోళిక లేదా సామ్రాజ్య భావాలతో పురాతన కాలం నుంచీ మమేకమైపోయారని రాశారు. కాబట్టి పాత సాంస్కృతిక భావనలను ప్రస్తుత రాజకీయ ఆలోచనల నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు