ఎన్నాళ్లీ వానరయుద్ధం

21 Jul, 2020 11:32 IST|Sakshi
జైపూర్‌ బస్టాండ్‌ సమీపంలో కోతుల గుంపు

జైపూర్‌ మండలంలో కోతుల బెడద

ఇళ్లు ధ్వంసం.. ప్రజలపై దాడులు ఎవరో యుద్ధానికి వస్తున్నట్లు అప్రమత్తం

పెరిగిపోయిన వానరమూకలు

నియంత్రణ చర్యలు శూన్యం

జైపూర్‌(చెన్నూర్‌): మండలంలో వా‘నర’యుద్ధమే జరుగుతోంది. ఏక్షాణాన ఎటు నుంచి వానరమూకలు దాడి చేసి ఇళ్లపై పడతాయోనని నిత్యం ప్రజలు భయపడుతున్నారు. ఎంత భయపడ్డా రోజూ ఏదో చోట కోతులు దాడి చేస్తూ అమాయక జనాలను గాయపరుస్తూనే ఉన్నాయి. పెంకుటిళ్లను పీకి పందిరి వేస్తున్నాయి. ప్రజలు కోతుల దాడులను తట్టుకోలేక బెంబేలెత్తుతున్నారు. జైపూర్‌ మండలంలో వానర మూకలబెడద చాలా ఎక్కువగా ఉంది. జైపూర్‌ మండల కేంద్రంతో పాటు ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, షెట్‌పల్లి, పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్‌(ఎస్‌), బెజ్జాల గ్రామాల్లో సమస్య అధికంగా ఉంది. ప్రజలు తమ ఇళ్ల తలుపులు ఎప్పుడూ మూసి ద్వారాల వద్ద ఎవరో యుద్ధానికి వస్తున్నట్లు కర్రలను సిద్ధంగా ఉంచుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఎవరి ఇళ్లముందు చూసినా కోతులను పారదోలేందుకు కర్రలు సిద్ధం చేసుకున్న దృశ్యాలే కనిపిస్తుంటాయి. పొరపాటున ఆదమరిస్తే ఇంట్లోకి చొరబడి సామగ్రిని కొల్లగొడతాయి. మండలంలో కోతుల దాడిలో గాయపడ్డ వారి సంఖ్య రో జురోజుకీ పెరిగిపోతోంది. సామగ్రి కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకురావటం కూడా ఇబ్బందే. వెంబడించి మరీ దాడి చేసి వస్తువులను గుంజుకుంటున్నాయి.

కోతుల భయానికి జడిసి..
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పరిసరాల్లో (పెరడు)లో కూరగాయలను పండిస్తుంటారు. కోతుల భయంతో ఇక్కడి ప్రజలు పెరడులో కూరగాయలను సాగు చేయటం పూర్తిగా మర్చిపోయారు. మానవులపై పోరాటం చేస్తున్న వానరులను నరులు ఏమీ చేయలేకపోతున్నారు. కోతుల ఇక్కట్లను ఎలా తొలగించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

సెంటిమెంటే కారణమా..?
మొదట్లో ఇక్కడ కోతులుండేవికావు. 2003లో కరీంగనర్‌ జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి డీసీఎంలలో కోతులను పట్టుకొచ్చి ఇక్కడి అటవీప్రాంతంలో వదిలి పెట్టడంతో కోతులు తయారయ్యాయి. అక్కడి పురపాలక సంస్థలు వీటి బెడదను తప్పించుకునేందుకు వాటిని పట్టించి వాహనాల్లో తీసుకువచ్చి ఈ ప్రాంతంలో వదిలేశారు. అయితే అప్పుడే పట్టుకున్న కోతులను హతమార్చి ఉంటే ఈ బెడద ఉండేది కాదు. కానీ కోతులను చంపితే మహా పాపం.. కోతులంటే దేవుడని రకరకాల సెంటిమెంట్లతో వాటిని హతమార్చకుండా భద్రంగా వదిలించుకున్నారు. ఇప్పుడు ఇక్కడి స్థానిక సంస్థలు కూడా సెంటిమెంట్‌తో వాటిని చంపలేక, దొరకబట్టి వేరేచోట వదలలేక చేతులెత్తేశాయి. దీంతో నాడు పదుల సంఖ్యలో ఉన్న కోతులు నేడు వేల సంఖ్యలో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.

కోతులతో వేగలేకపోతున్నాం
గ్రామంలో విపరీతంగా కోతులున్నాయి. రోజు రోజుకూ వాటి సంఖ్య పెరిగిపోతుంది. పెరట్లో కూరగాయల చెట్లను దక్కనివ్వడం లేదు. పెట్టిన చెట్లను కూడ నాశనం చేస్తున్నాయి. కోతుల బాధకు కూరగాయల చెట్లు పెట్టడమే మానేశాం. ఉదయం, సాయంత్రం సమయంలో వీధుల్లో    ఎక్కువగా కోతులు వస్తున్నాయి.– వెంకటలక్ష్మి, ఇందారం

మరిన్ని వార్తలు