ఉత్పత్తిలో అగ్రగామి.. జైపూర్‌ 

2 Nov, 2017 02:35 IST|Sakshi

పీఎల్‌ఎఫ్‌లో ఏపీ, తెలంగాణ జెన్కోల కన్నా ముందంజలో పవర్‌ప్లాంట్‌ 

9,084 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి 

అభినందించిన సీఎండీ శ్రీధర్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. ఏపీ.. టీఎస్‌ జెన్కో, ఎన్జీ పీసీల కన్నా అధికంగా ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టరీ (పీఎల్‌ఎఫ్‌) సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌తో ముగి సిన 7 నెలల కాలంలో సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ) 89 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించగా, తెలంగాణ జెన్కో 71%, ఏపీ జెన్కో 67% సాధించాయి. రామగుండంలోని ఎన్టీపీసీ 79% పీఎల్‌ఎఫ్‌ను నమోదు చేసుకుంది.

కాగా, జైపూర్‌ ఎస్టీపీపీ గడిచిన అక్టోబర్‌ నెలలో 96.5% పీఎల్‌ఎఫ్‌ను సాధించడం గమనార్హం. ప్లాంట్‌లోని రెండో యూనిట్‌ 98.92%, మొదటి యూని ట్‌ 94.13% పీఎల్‌ఎఫ్‌ నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా గత ఆగస్టులో ప్లాంట్‌లో 98.43 % పీఎల్‌ఎఫ్‌ నమోదైంది.   సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైన గత సంవత్సరం ఆగస్టు నుంచి ఇప్పటివరకు 9,724 మిలియన్‌ యూనిట్లను రాష్ట్రానికి సరఫరా చేసింది.దీనిలో మొదటి యూనిట్‌ నుంచి 4,839 యూనిట్లు, రెండో యూనిట్‌ నుంచి 4,248 మిలియన్‌ యూనిట్లను గజ్వేల్‌ పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేసింది. కాగా, విద్యుదుత్పత్తి, సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఎస్టీపీపీ ఉద్యోగులు, అధికారులను సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు