జాతీయ ఎజెండా కావాలి

3 Nov, 2019 02:17 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న జైరామ్‌ రమేశ్‌

తూర్పు కనుమల పరిరక్షణపై కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తూర్పు కనుమలను కాపాడుకోవడమన్నది అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. దీనిని జాతీయ ఎజెండాగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఇక్కడ తూర్పుకనుమల పరిరక్షణ వేదిక (గ్రేస్‌), కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు తీరానికి ఎక్కువగా తుపానులు సంభవించడం, దానిని ఆనుకుని ఉన్న కనుమల లో పలు రకాల మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టడం వంటి అంశాలను ప్రస్తావించారు. తూర్పుకనుమలను కాపాడుకున్నప్పుడే తీరప్రాంతాన్ని కూడా రక్షించుకోగలుగుతామని, దానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణానికి సంబంధించి కేంద్రం ఏమైనా ప్రతిపాదనలు చేస్తే రాష్ట్రాలు సహకరించాలని అప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు.

తూర్పు కనుమల పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా త్వరలో పర్యావరణంపై జరిగే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ‘గ్రేస్‌’ ప్రతినిధులకు ఆహ్వానం పంపుతామన్నారు. పర్యావరణ సమతూకం లేని ఆర్థికాభివృద్ధికి అర్థం లేదంటూ రెండింటినీ సమతూకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తూర్పుకనుమల పరిరక్షణ కు ‘గ్రేస్‌’ ప్రచురించిన పుస్తకంలోని  వివరాల ఆధారంగా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. తూర్పుకనుమలను కాపాడాలన్న శ్రద్ధ ఎవరికీ లేకపోవ డం దురదృష్టకరమని పాలసీ నిపుణుడు మెహన్‌ గురుస్వామి అన్నారు. పర్యావరణ నిపుణుడు తులసీదాసు ‘గ్రేస్‌’ రూపొందించిన పుస్తకంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌రెడ్డి, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ వ్యవస్థాపకుడు కె.లక్ష్మారెడ్డి, సీజీఆర్‌ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా