బ్యాంకుల జాతీయీకరణకు కారణం ‘నీలం’

29 Jul, 2018 01:02 IST|Sakshi

రాష్ట్రపతిగా సంజీవరెడ్డి పేరు

ప్రతిపాదనతో ఆ ప్రక్రియ వేగవంతం

పీఎన్‌ హక్సర్‌ సలహా మేరకు దీనిపై ఇందిర నిర్ణయం

‘మంథన్‌’లో ఆసక్తికర విషయాలు వెల్లడించిన జైరాం రమేశ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో బ్యాంకుల జాతీయీకరణకు.. మాజీ రాష్ట్రపతి, తెలుగువాడు నీలం సంజీవరెడ్డి కారణమా? అప్పటి ప్రధాని ఇందిరాగాం«ధీ ఇష్టాన్ని కాదని కాంగ్రెస్‌ పార్టీ సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం పరోక్షంగా బ్యాంకుల జాతీయీకరణ వేగంగా జరిగేలా చేసిందా? దీనికి అవుననే సమాధానం చెపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌. రాష్ట్రపతిగా బాబూ జగ్జీవన్‌రామ్‌ను చూడాలని ఇందిర అనుకున్నారని, అయితే పార్టీ ఆమె అభీష్టానికి విరద్ధంగా నీలం పేరును ప్రతిపాదించడంతో ఇందిర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లండన్‌లో తన క్లాస్‌మేట్‌ అయిన పీఎన్‌ హక్సర్‌ సలహా మేరకు బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియను వేగవంతం చేశారని చెప్పారు.

1967–73 మధ్య అప్పటి ప్రధాని ఇందిరకు ‘ఆత్మ’గా వ్యవహరించినట్టు చెప్పే పీఎన్‌ హక్సర్‌ జీవిత చరిత్రను ‘ఇంటర్‌ట్వైన్డ్‌ లైవ్స్‌’పేరుతో జైరాం పుస్తకంగా రాశారు. ఈ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చర్చా వేదిక మంథన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జైరాం ఈ పుస్తకం వెనక దాగున్న అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు.

ఇందిర హయాంలో అత్యంత శక్తివంతుడైన అధికారిగా హక్సర్‌ ఎన్నో సేవలు అందించారని, బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, అణ్వస్త్ర ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల రూపకల్పన వంటి అనేక కీలకమైన విధానాల వెనుక ఉన్నది ఆయనేనని జైరాం తెలిపారు. దేశం బాగోగుల కోసం ప్రభుత్వ విధానాల రూపకల్పన చేసే వ్యవస్థగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (అప్పట్లో ప్రధానమంతి సెక్రటేరియట్‌)ను ఏర్పాటు చేసింది కూడా హక్సర్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడేనని వివరించారు.

సర్వం తానై..
జవహర్‌లాల్‌ నెహ్రూ మరణం తర్వాత.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టిన ఇందిర తన చిన్ననాటి మిత్రుడైన హక్సర్‌ను లండన్‌ నుంచి రప్పించుకుని మరీ కార్యదర్శిగా చేర్చుకున్నారని జైరాం తెలిపారు.

1967–73 మధ్య హక్సర్‌ సర్వం తానై అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయంగానూ ఇందిరకు సహరించారని, 1967 ఎన్నికల్లో 282 స్థానాలు మాత్రమే కలిగిన కాంగ్రెస్‌.. తర్వాత ఎన్నికలు వచ్చేనాటికి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించే స్థాయికి చేరడం వెనుక హక్సర్‌ మంత్రాంగం, ఇందిరకు ఆయన ఇచ్చిన సలహాలు కీలకమయ్యాయన్నారు. నెహ్రూ స్మారక గ్రంథాలయంతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్న హక్సర్‌ లేఖలు, కార్యదర్శిగా ఆయన జారీ చేసిన మెమోలు, ఫైల్‌ నోటింగ్స్‌ అన్నింటినీ ఏడాది పాటు క్షుణ్ణంగా పరిశీలించి తాను ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు.


1971లోనే ఎమర్జెన్సీ పెట్టమన్నాడు..
దేశ రాజకీయాల్లో చీకటి అధ్యాయంగా చెప్పుకునే ఎమర్జెన్సీని హక్సర్‌ సూచనల ప్రకారం 1971లోనే విధించి ఉంటే దేశం పరిస్థితి ఇంకోలా ఉండేదేమోనని జైరాం అభిప్రాయపడ్డారు. యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి బంగ్లా దేశ్‌ను విముక్తం చేసిన తర్వాత కొన్ని లక్షల మంది శరణార్థులు దేశంలో ఉండేవారని.. ఆ నేపథ్యంలో విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నెపంతో ఎమర్జెన్సీ విధించి ఉంటే రాజకీయంగా ఇందిరకు లాభం కలిగేదని హక్సర్‌ భావించారని, అయితే ఇందిర ఆ సలహాను తోసిపుచ్చి.. ఆరేళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని వివరించారు.

1972లో జుల్ఫికర్‌ అలీ భుట్టోతో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందం కశ్మీర్‌ సమస్యకు కారణమన్న కొందరి వాదనను తాను అంగీకరించబోనన్న జైరాం.. ఆ ఒప్పందం ద్వారా భారత్‌కు మేలే జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్‌ అధికారులు, మంథన్‌ నిర్వాహకులు అజయ్, విక్రం గాంధీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు