అస్తిత్వ పతాక..ఆత్మగౌరవ ప్రతీక

22 Jun, 2014 03:03 IST|Sakshi
అస్తిత్వ పతాక..ఆత్మగౌరవ ప్రతీక

జయశంకర్ మూడో వర్ధంతి సభలో కేసీఆర్ హైదరాబాద్‌లో భారీ విగ్రహం, స్మారకచిహ్నం
 
  హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వ జయపతాక ఆచార్య జయశంకర్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్ మూడో వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో ఆయన విగ్రహానికి శనివారం పూల మాల వేసి కేసీఆర్ నివాళులర్పించారు. ఒకనాడు ఆత్మగౌరవంతో బతికి తర్వాత కోల్పోయిన అస్తిత్వం పునరుద్ధరణకోసం పోరాడిన జయశంకర్‌ను స్మరించుకోవడానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం తరపున భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమైన స్థలంలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ఆయ న వెల్లడించారు. వరంగల్‌లోని ఏకశిలా పార్కును జయశంకర్ పేరిట మార్చనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో ఒక జిల్లాకు జయశంకర్ పేరును పెడతామని తెలిపా రు.  జయశంకర్ సాహిత్యం, ఆలోచనావిధానం, పోరాటం, రచనలు, ఉపన్యాసాలు అందుబాటులో ఉన్నాయని చెప్పా రు. వీటిని విస్తృతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జయశంకర్ ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదన్నారు. అణిచివేతకు గురైన ఒక జాతి పక్షానపోరాడిన జయశంకర్ యావత్‌దేశానికి ఆదర్శనీయుడని కేసీఆర్ కీర్తించారు. తెలంగాణకోసం 1952లో, 1969లో జరిగిన పోరాటాలతో పాటు ఇప్పుడు జరిగిన ఉద్యమాలను చూసిన జయశంకర్ ఇప్పుడు లేని లోటు తీరనిదన్నారు.  తెలంగాణ ఏర్పాటైన ఈ తరుణంలో జయశంకర్ బతికి ఉంటే పునర్నిర్మాణంలో ఎంతో ఉపయోగకరంగా ఉండేదని కేసీఆర్ చెప్పారు.

చిదంబరం ప్రకటనకు డ్రాఫ్టు జయశంకర్‌దే...

తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా 9 డిసెంబర్ 2009లో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు సంబంధించిన ముసాయిదాను ఆచార్య జయశంకరే రాసినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.ఎన్నో విపత్కర సమయాల్లో ఉద్యమాలకు ప్రాణంపోసిన జయశంకర్ వంటి మహనీయులు ప్రస్తుతం లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అస్తిత్వం, భాష, యాస, జీవనసంస్కృతిపై జరి గిన దాడిని ఎన్నోసార్లు ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. జయశంకర్‌కు నివాళులు అర్పించిన వారిలో పార్టీ  సెక్రటరీ జరనల్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి, మంత్రులు కె.తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ కె.కవిత, నేతలు పేర్వారం రాములు, కొండా సురేఖ, వ్యక్తిగత సహాయ కార్యదర్శి దేశపతి శ్రీనివాస్‌లు ఉన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు