పతులా.. సతులా..!

23 Jul, 2019 11:15 IST|Sakshi

రిజర్వేషన్లతో తేలనున్న ఆశావహుల భవితవ్యం  

పరిస్థితిని బట్టి రంగంలోకి భార్యాభర్తలు

ప్రధాన పార్టీలకు రెబెల్స్‌ బెడద

కుల, మహిళా సంఘాలతో మంతనాలు 

జమ్మికుంటటౌన్‌(హుజూరాబాద్‌): వార్డుల విభజన ముగిసింది. ఓటర్ల లెక్కతేలింది. ఇక మిగిలింది రిజర్వేషన్ల ప్రక్రియ. దీంతో ఆశావహుల భవితవ్యం తేలనుంది. రిజర్వేషన్లు అనుకూలిస్తే బరిలోకి దిగేందుకు నాయకులు, అవసమైతే భార్యలను పోటీలో నిలిపేందుకు సన్నద్ధమవుతున్నారు. టికెట్లు దక్కకుంటే రెబెల్స్‌గానైనా పోటీ చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.  

విభజనతో మారిన రూపురేఖలు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 14 పురపాలక సంఘాలున్నాయి. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్, వేములవాడ బల్దియాలు పాతవే కాగా చొప్పదండి, కొత్తపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, మంథని, రాయికల్‌ మున్సిపాల్టీలు కొత్తగా ఏర్పడ్డాయి. అన్ని పార్టీల నాయకులు రిజర్వేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. రిజర్వేషన్‌ అనుకూలంగా ఎవరు బరిలోకి దిగాలనే విషయమై ఎవరి సామాజికవర్గానికి వారు సమాలోచనలు సాగిస్తున్నారు.

 సంఘాలతో మంతనాలు 
మున్సిపాల్టీ పదవులను ఆశిస్తున్న ఆశావహులు ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే వివిధ సంఘాల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. ప్రధానంగా కుల, మహిళా సంఘాల నాయకులతో టచ్‌లో ఉంటున్నారు.

 ప్రధాన పార్టీలకు రెబెల్స్‌ బెడద 
అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెబెల్స్‌ బెడద తప్పదని భావిస్తున్నారు. అన్ని పార్టీలలో ఇప్పటి నుంచే ఆశావహులు బడానేతల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడితే రాజకీయం రసవత్తరం కానుంది.  

మరిన్ని వార్తలు