సైద్ధాంతిక విభేదాలతోనే బయటకొచ్చా

26 Dec, 2017 01:24 IST|Sakshi

మావోయిస్టు పార్టీ కీలక నేత జంపన్నభార్యతో కలసి డీజీపీ ఆఫీసులో లొంగుబాటు

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీతో సైద్ధాంతికపరమైన విభేదాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత జంపన్న అలియాస్‌ జినుగు నర్సింహారెడ్డి తెలిపారు. 33 ఏళ్లుగా పార్టీలో నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన తాను భార్య అనిత అలియాస్‌ రజితతో సహా స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సోమవారం డీజీపీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.

చర్చించే అవకాశం లేదు..
దేశంలో గత పదిహేనేళ్లలో విపరీతమైన మార్పులు వచ్చాయని, గతంలో ఉన్న ట్లుగా భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేదని జంపన్న అభిప్రాయపడ్డారు. కానీ కార్మిక, ఉద్యోగ, యువత, ప్రజల సమస్యలపై మావోయిస్టు పార్టీ పోరాట పం థాలో మార్పు రాలేదని, దీనిపై తాను కేంద్ర కమిటీ సభ్యుడిగా చర్చించే అవ కాశం లేకుండాపోయిందని జంపన్న తెలిపారు. అయితే ఈ అంశంపై తనను పార్టీలోనే ఉండి పార్టీ పనితీరు, పద్ధతిలో మార్పు తెచ్చేలాగా పోరాడాలని సహ చరులు చెప్పినా తాను వినలేదని, తన వల్ల ఆ మార్పు సాధ్యం కాదన్న అభి ప్రాయంతో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని బయటకు వచ్చానని వెల్లడించారు.

పార్టీకి ద్రోహం చేసినట్లు కాదు..
వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం బయటకు వచ్చానని చెబుతూనే మావోయిస్టు పార్టీపై ఆరోపణలు చేయడంపై ప్రశ్నించగా తాను పార్టీని దూషించడంలేదని జంపన్న పేర్కొన్నారు. ఎప్పుడో ఏళ్ల కింద ఉన్న సిద్ధాంతాలు, పనితీరు ప్రక్రియే నేటికీ కొనసాగుతోందని, అది పార్టీ పునర్నిర్మాణానికి ఉపయోగపడదని తాను చెప్పానన్నారు. దీంతో పార్టీ సభ్యులు తనకు మధ్య విభేదాలు ఏర్పడినట్లుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అంతే కానీ తాను పార్టీకి ద్రోహం చేసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీలో మార్పులు జరిగితే మళ్లీ వెళ్తారా అనే ప్రశ్నపై జంపన్న స్పందిస్తూ తనకు ఇక అంత ఓపిక లేదన్నారు.

ఇప్పుడే చెప్పలేను...
పోలీసులకు లొంగిపోయే వ్యవహారంలో ఓ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సాయం చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా అలాంటిదేమి లేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు వచ్చానని జంపన్న తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారా అని అడగ్గా ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జంపన్న వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు