పాక్ నుంచైనా పోటీ చేస్తా: వేణుమాధవ్

19 Mar, 2014 13:23 IST|Sakshi
పాక్ నుంచైనా పోటీ చేస్తా: వేణుమాధవ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సూపర్ పార్టీ అని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అభివర్ణించారు. జనసేన పార్టీ మేనిఫెస్టో తనను బాగా ఆకర్షించిందన్నారు. పవన్ ఆశయాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో వేణుమాధవ్ భేటీ అయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆశయాలు నచ్చడం వల్లే తాను టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు వేణుమాధవ్ వెల్లడించారు. తనకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అభిమానులు ఉన్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా కూడా పోటీ చేస్తానన్నారు. చివరికి పాకిస్థాన్లో అభిమానులుంటే అక్కడి నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమని చమత్కరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో తనకు అనుబంధం ఉన్న విషయాన్ని ఈ సందర్బంగా వేణుమాధవ్ గుర్తు చేశారు. నల్గొండ జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు అనుమతించాలని చంద్రబాబును వేణుమాధవ్ కోరారు.

మరిన్ని వార్తలు