తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం

28 Oct, 2019 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం తార్నాకలో  బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌.. బస్సును అదుపు చేయలేక.. ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో.. మూడు కార్లు, ఓ బైక్‌ ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్‌ పారిపోయారు.  జేబీఎస్‌ నుంచి జనగామ వెళుతుండగా హబ్సీగూడ సిగ్నల్స్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.

గోతిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్డు వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డుపక్కనున్న గోతిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 13మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాగా తాత్కాలిక డ్రైవర్లకు సరైన అనుభవం లేకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ప్రమాదాలు జరిగాయి.

24వ రోజుకు చేరిన సమ్మె
కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్‌ కార్మికుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని వారు హితవు పలికారు. ఈనెల 30న సరూర్‌నగర్‌ నగర్‌లో సకలజనుల సమరభేరి సభను నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు