మలుపుతిప్పిన ‘జానపదం’ 

15 Mar, 2018 09:26 IST|Sakshi
యాంకర్‌లు హరిచందన, లాస్యలతో చిన్నారులు

బుల్లితెరపై మెరవనున్న పట్టణ చిన్నారులు

టీవీ ప్రోగ్రాంకు ఎంపికైన సుధా లహరి, సుధా మాధురి

సీరియల్స్‌లో నటించేందుకు కూడా అవకాశం

ఆకట్టుకుంటున్న చిన్నారుల నృత్యాలు

ఆదిలాబాద్‌: బుల్లితెర(టీవీ)పై నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదనగలరు. ఇలాంటి అవకాశాన్ని పట్టణానికి చెందిన చిన్నారి ఆర్టిస్టులు అందుకోనున్నారు.  ఇచ్చోడ మండలం అడెగామ–కె గ్రామానికి చెందిన న్యాయవాది సంగెం సుధీర్‌కుమార్, అమృతవాణి దంపతుల కూతుర్లు సుధాలహరి, సుధామాధురి ప్రస్తుతం ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో ఉంటున్నారు. 

‘జానపదం..దుమ్మురేపు’ తో.. 
అక్కాచెల్లెలు సుధాలహరి, సుధామాధురి గతేడాది ఓ న్యూస్‌ చానల్‌లో నిర్వహించిన జానపదం–దుమ్మురేపు అనే కార్యక్రమానికి చైల్డ్‌ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. సుధాలహరి నాలుగోతరగతి చదువుతుండగా, మాధురి 3వ తరగతి చదువుతోంది. డాన్సులు, పాటలు అంటే ఎంతో ఇష్టపడే వీరికి అనుకోకుండా ఒక అవకాశం రావడంతో టీవీ కార్యక్రమాలకు ఎంపికయ్యారు.  

మొదటి అవకాశంతో.. 
న్యూస్‌ చానల్లో జానపదం–దుమ్మురేపు అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సమాచారం రావడంతో చిన్నారుల తండ్రి సుధీర్‌కుమార్‌ వారి పిల్లల ఫొటోలు, వివరాలు ప్రోగ్రాం కోడైరెక్టర్‌ వంశీకి పంపించారు. దీంతో అక్కడి నుంచి పిలుపు రావడంతో 2017 జనవరిలో ప్రిలిమినరీ సెలక్షన్స్‌ కోసం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోకు వెళ్లారు. ప్రోగ్రాంలో ఇద్దరు చిన్నారులు జానపదగేయంపై డ్యాన్సులు చేసి ఆకట్టుకోవడంతో టీవీషోకు ఎంపికయ్యారు.

న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఆర్‌పీ పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న చిన్నారులను చైల్డ్‌ ఆర్టిస్టులుగా ఎంపిక చేశారు. తర్వాత జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ఈ షోకు సంబంధించిన షుటింగ్‌లో నటించారు. డాన్సులతో పాటు ఇద్దరు చిన్నారులు జానపద పాటలు ఆలపించనున్నారు. ఈ కార్యక్రమం షుటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రముఖ టీవీ చానల్లో ఓ సీరియల్‌లో నటించేందుకు వీరిద్దరికి అవకాశం వచ్చింది. త్వరలో ఈ సీరియల్‌ ప్రారంభం కానుంది. ఎంపికపై చిన్నారుల తల్లిదండ్రులు సుధీర్‌అమృతవాణి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు