జానపద జావళి

22 Aug, 2018 15:00 IST|Sakshi
జానపద గిరిజన పీఠం భవనం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి(ఫైల్‌) 

‘జానపద గిరిజన విజ్ఞాన పీఠం’తెలుగు సంస్కృతికి  వెలుగులద్దిన కాకతీయ చక్రవర్తుల రాజధాని ఓరుగల్లులో  1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠానికి అంకుర్పారణ జరిగింది.   ఆదివాసీ గిరిజన తెగల జీవన పరిణామ క్రమంలో వారు ఉపయోగించిన ఎద్దుల బండ్లు, టంగాలు, సంగీత వాయిద్యాలు, సవారి కచ్చురం, పనిముట్లు, కీలు గుర్రాలు, వివిధ శుభకార్యక్రమాల్లో వాడే పల్లకీలు తదితర వస్తువులను జాగ్రత్తగా విజ్ఞాన పీఠం మ్యూజియంలో భద్రపరిచారు.

గిరిజన కళారూపాలను భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో విజ్ఞాన పీఠం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.నేడు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ‘ఓరుగల్లు  జానపద గిరిజన విజ్ఞాన పీఠం’పై ‘సాక్షి’ప్రత్యేక కథనం..

హన్మకొండ కల్చరల్‌:     తెలంగాణ వాదం రగిల్చిన స్ఫూర్తితో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పడింది.  అప్పటి వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య పేర్వారం జగన్నాథం, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, కార్యదర్శి  వీ.ఆర్‌ విద్యార్థి, పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్‌ తదితర ప్రముఖుల ఆకాంక్షతో ఈ పీఠం రూపుదిద్దుకుంది.  1998 లో ఇక్కడ పీహెచ్‌డీ కోర్సులు, ఎంఫిల్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. 

టూరిజం కేంద్రంగా రూపొందాలని..

1999లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం జిల్లాలో ప్రత్యేక సందర్శనీయ స్థలంగా అభివృద్ధి చెందనుందని భావించి అప్పటి  కలెక్టర్‌ శాలినీమిశ్రా హంటర్‌రోడ్‌లో 3.7 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ పీఠం డీమ్డ్‌ యూనివర్సిటిగా అభివృద్ధి చెందాలని భావించిన  జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత  ఆచార్య సి. నారాయణరెడ్డి అందించిన రూ. 30 లక్షల ఎంపీ లాడ్స్‌ నిధులతో 2000 సంవత్సరంలో స్వంత భవనం నిర్మించారు. 2001లో దూరవిద్యాకేంద్రం ప్రారంభం కాగా దానికి అనుబంధంగా వరంగల్‌లో దూరవిద్యాకేంద్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2009 లో రాణి రుద్రమదేవి పేరిణి కళా కేంద్రాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు.  

జానపదుల కళలకు సజీవ రూపం

పీఠానికి చెందిన పరిశోధన బృందం గ్రామాలకు వెళ్ళి అక్కడ రోజుల తరబడి ఉంటూ వారితో మాట్లాడుతూ జానపదుల విజ్ఞానాన్ని, కళలను భవిష్యత్‌ తరాలకు సజీవ రూపంలో అందించేలా కృషి చేస్తున్నారు.  వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొడ, కృష్ణ, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడపజిల్లాలో సర్వే నిర్వహించి.. ఆయా ప్రాంతాల్లోని కళా బృందాలను  ప్రోత్సహించారు.

జాతీయస్థాయి గుర్తింపు  

 తెలుగు జానపద విజ్ఞానం మీద జరుగుతున్న అధ్యయనం మరింత అర్ధవంతంగా, వైవిధ్యంగా జరగడానికి గిరిజన పీఠం ఏర్పాటు చేసిన సదస్సులు జాతీయస్థాయిలో ప్రశంసలు పొందాయి. 1000 గంటల నిడివిగల వీడియోలు, 10వేల ఛాయాచిత్రాలు, 9000 పేజీల రాత ప్రతులు పీఠం మ్యూజియంలో నిక్షిప్తం చేశారు.  

18 జాతీయ సదస్సులు

జానపద గిరిజన íపీఠం ఆధ్వర్యంలో 18 జాతీయ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ రంగాల ప్రముఖులు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీకరించి..    ‘జానపద గిరిజన విజ్ఞానం   జాతీయ సదస్సుల పత్రాలు’ అనే పుస్తకంగా ప్రచురించారు.

జానపద గిరిజన విజ్ఞానంపైపలు పుస్తకాలు..

ఇప్పటివరకు జానపద విజ్ఞాన సమాలోచన, నల్గొండ  రాష్ట్రస్థాయి జానపద కళోత్సవాలు ప్రత్యేక సంచిక, జానపద కిరణం త్రైమాసిక పత్రిక, మన పల్లెటూళ్ల పాటలు అమ్మాపురం, కొర్రాజుల కథలు, జానపద విజ్ఞానదర్శిని, చౌళ్లపల్లి, జానపదవిజ్ఞాన దర్శిని , విస్నూరు, వల్మిడి, ద్రౌపది తిరుణాళ్ళు (ధర్మరాజు తిరునాళ్ళు), తూర్పుగోదావరి జిల్లా  జానపద ఆటలు,  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, కొండరెడ్డి గిరిజ నుల జీవనవిధానం, బొడ్లంక పాటలు, పగటివేష కళా కారుల సాంస్కృతిక జీవనం (పార్వతీనగర్‌),  మల్లన్న జాతర ఐనవోలు, బంజారాల తీజ్‌పండుగ  పుస్తకాల ను ప్రచురించారు.  

అరుదైన జానపద కళారూపాలపై పరిశోధన..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రముఖంగా చిందుయక్షగానం, డక్కలి, గౌడశెట్టి, ఏనుటి, మందహెచ్చు, కాకిపడిగెల, మాసయ్య, గంజికూటి, కూజరి, డోలి, పట్టెడ, బాట్స్, దాడి, బైండ్ల, దూబ్బుల, బుడబుక్కల, ఒగ్గు, పంబాల, మొండి, గంగిరెద్దు, బాలసంతు, జంగాలు, శారద, డప్పు, పాములాట, చెక్కబొమ్మలాట, తోలుబొమ్మలాట, ఎరుకసోదే, పిట్టలదొర, లంబాడానృత్యం, కోయనృత్యం, కోర్రాజులు, కూనపులి, ఆద్దెపుసింగు, కాటిపాపల, హరిదాసులు, కడ్డీతంత్రి, కోలాటం, చెక్కభజ న, మాలభోగం, కిన్నెర, చిలుకపంచాంగం వంటి ఎన్నో కళారూపాలు దర్శనమిస్తాయి.  జానపద గిరిజన విజ్ఞానపీఠం.. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సహకారంతో  వారిజీవన విధానాలపై పరిశోధనలు జరిపి  పుస్తకాలుగా వెలువరించనున్నారు.

భవిష్యత్‌ తరాలకు వారధి

జానపదగిరిజన విజ్ఞానపీఠాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి. అంతరించిన , అంతరిస్తున్న అనేకానేక ఉపకరణాలను మ్యూజియంలో మళ్ళీ వీక్షిం చే అవకాశం కల్పించిన ఈ సంస్థకు అభినందనలు.

– సిరికొండ మధుసూదనాచారి, శాసనసభాపతి

ప్రతి కళారూపంపై పుస్తకం

రాష్ట్ర సాంస్కృతికశాఖ సహకారంతో  ఇటీవలే కొమ్ము, అద్దపుసింగు, కూనపులి, రుంజ, తోటి, గుర్రపు, తదితర కళారూపాలపై డాక్యుమెంటేషన్‌ నిర్వహించాం. త్వరలోనే పుస్తకం రూపొందిస్తాం. తెలంగాణ మాండలిక భాషాపదాలను కూడా 13వేల వరకు సేకరించాం. వచ్చే నెలలో జాతీయసదస్సు నిర్వహించనున్నాం. విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, రిజిస్ట్రార్‌ ఆచార్య ఆలేఖ్య పుంజాల మా పరిశోధనలను ప్రొత్సహిస్తున్నారు.    

– ఆచార్య భట్టు రమేష్, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్‌ 
 

మరిన్ని వార్తలు